Kattu Charu : కట్టు చారు.. ఈ చారును ఉగాది పండుగ నాడు ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. కట్టు చారు చాలా రుచిగా ఉంటుంది. మరీ చిక్కగా, మరీ పలుచగా కాకుండా ఎంతో రుచిగా ఉండే ఈ చారును అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. దీనిని ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా తయారు చేసే కట్టు చారు కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ కట్టు చారును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కట్టు చారు తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, మెంతులు – పావు టీ స్పూన్, మిరియాలు – అర టీ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, తరిగిన పచ్చిమిర్చి – 3, కరివేపాకు – ఒక రెమ్మ, ఇంగువ – పావు టీ స్పూన్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన మునక్కాయ- 1, తరిగిన బంగాళాదుంప – 1, తరిగిన టమాట – 1, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, ఉడికించిన శనగపప్పు లేదా కందిపప్పు – పావు కప్పు, నీళ్లు – ఒకటిన్నర గ్లాసులు లేదా రెండు గ్లాసులు, కారం – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
కట్టు చారు తయారీ విధానం..
ముందుగా కళాయిలో మెంతులు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో ఉడికించిన పప్పు, కొద్దిగా జీలకర్ర, రెండువెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్క, మునక్కాయ, బంగాళాదుంప ముక్కలు వేసి వేయించాలి. వీటిని 3 నిమిషాల పాటు వేయించిన తరువాత టమాట ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి.
ఇలా మగ్గించిన తరువాత చింతపండు పసుపు వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు మరిగించిన తరువాత మిక్సీ పట్టుకున్న పప్పు వేసి కలపాలి. తరువాత నీళ్లు, కారం వేసి కలపాలి. తరువాత కరివేపాకు, కొత్తిమీర వేసి చారును మరిగించాలి. చారు మరుగుతున్నప్పుడు మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. ముక్కలు మెత్తగా ఉడికి చారు మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కట్టు చారు తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన కట్టు చారును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.