Kobbari Appalu : ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు.. మన ఇండ్లలో పిండి వంటల ఘుమ ఘుమలు నోట్లో నీళ్లూరించేలా చేస్తుంటాయి. ఈ క్రమంలోనే రకరకాల పిండి వంటలను చేస్తుంటారు. ముఖ్యంగా అప్పాలను బాగా వండుతారు. అయితే కొబ్బరితోనూ అప్పాలను చేసుకోవచ్చు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. కొబ్బరి అప్పాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి అప్పాల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక కిలో, బెల్లం – అర కిలో, కొబ్బరికాయ – ఒకటి, నూనె – అర కిలో.
కొబ్బరి అప్పాలను తయారు చేసే విధానం..
బియ్యాన్ని ముందురోజే ఓ రాత్రంతా నానబెట్టుకోవాలి. నీళ్లన్నీ వంపేసి పిండి పట్టించాలి. కొబ్బరిని తురిమి పెట్టుకోవాలి. ఓ వెడల్పాటి గిన్నెలో బెల్లం, కాసిని నీళ్లు తీసుకుని పొయ్యి మీద పెట్టాలి. బెల్లం కరిగి ఉండపాకం వచ్చాక దింపేయాలి. ఇందులో కొబ్బరి తురుము, బియ్యం పిండి, కొద్దిగా నూనె చేర్చి బాగా కలిపి పదిహేను నిమిషాలు నాననివ్వాలి. బాణలిలో నూనె వేసి వేడి చేశాక.. ఓ ప్లాస్టిక్ కవర్‌పై ఈ మిశ్రమాన్ని అప్పాల్లా అద్ది వేయించాలి. బంగారు వర్ణంలోకి వచ్చాక తీసేస్తే కమ్మని, వేడి వేడి అప్పాలు సిద్ధమవుతాయి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. ఈ పండగకి వీటిని టేస్ట్ చేయడం మరిచిపోకండి.