Laddu For Back Pain : మనల్ని వేధించే వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో నడుము నొప్పి కూడా ఒకటి. ఈ సమస్యతో మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యలో ఇది కూడా ఒకటి. నడుము నొప్పితో బాధపడే వారు కిందత చెప్పిన విధంగా లడ్డూలను తయారు చేసుకుని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిని తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ లడ్డూలను తయారు చేయడం కూడా చాలా సులభం. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమల లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమలు – ఒక కప్పు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, బాదం పప్పు – అర కప్పు, గోంధ్ – ఒక టేబుల్ స్పూన్, ఫూల్ మఖనా – అర కప్పు, ఎండు కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్స్, బెల్లం తురుము – ఒక కప్పు, నీళ్లు – పావు కప్పు, యాలకులు – 3.
గోధుమ లడ్డూ తయారీ విధానం..
ముందుగా గోధుమలను శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా వడకట్టాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక ఆరిన గోధుమనలు వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో బాదంపప్పు వేసి రంగు మారే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత గోంధం ను వేసి వేయించాలి. దీనిని చక్కగా పొంగే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. అలాగే ఫూల్ మఖనాను, ఎండు కొబ్బరిని కూడా విడివిడిగా వేసి వేయించి వీటిని కూడా ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక జార్ లో వేయించిన గోధుమలను తీసుకోవాలి. ఇందులోనే యాలకులు కూడా మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇదే జార్ లో వేయించిన మిగిలిన పదార్థాలన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇవి అన్ని కలిసేలా కలుపుకోవాలి.
ఇప్పుడు గిన్నెలో బెల్లం తురుము, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగి గులాబ్ జామున్ పాకం అయ్యే వరకు మరిగించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని వడకట్టాలి. వడకట్టిన బెల్లం పాకాన్ని ముందుగా సిద్దం చేసుకున్న గోధుమల మిశ్రమంలో వేసి బాగా కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమల లడ్డూ తయారవుతుంది. ఈ లడ్డూను రోజుకు ఒకటి చొప్పున తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులు, నడుము నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. ఈ విధంగా లడ్డూలను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.