Alu Tomato Kurma : మనం తరచూ చపాతీ, పుల్కా, రోటి వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. వీటిని తినాలంటే చక్కటి రుచి కలిగిన కూర కూడా ఉండాలి. కూర రుచిగా ఉంటేనే మనం వీటిని తినగలం. చపాతీ వంటి వాటిని మనం ఎక్కువగా బంగాళాదుంపతో చేసిన కూరలతో తింటూ ఉంటాం. బంగాళాదుంపలతో చపాతీ, పుల్కా వంటి వాటిని తినడానికి రుచిగా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బంగాళాదుంప టమాటా కుర్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా తరిగిన బంగాళాదుంపలు – పావు కిలో, పెద్ద ముక్కలుగా తరిగిన టమాటాలు – పావు కిలో, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెబ్బ, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండు కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క ముక్కలు – 2, వెల్లుల్లి రెబ్బలు – 4.
బంగాళాదుంప టమాట కుర్మా తయారీ విధానం..
ఈ వంటకాన్ని తయారు చేసుకోవడానికి గాను ముందుగా ఒక జార్ లో మసాలా పొడికి తయారీకి కావల్సిన పదార్థాలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత బంగాళాదుంప ముక్కలను, ఉప్పును, పసుపును వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు కళాయిపై మూతను ఉంచి బంగాళాదుంప ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ ముక్కలు వేగిన తరువాత టమాట ముక్కలు, కారం వేసి కలపాలి. తరువాత మరలా మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. టమాట ముక్కలు మెత్తగా అయిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించాలి. తరువాత నీటిని పోసి కలిపి మూత పెట్టాలి.
దీనిని మరో 10 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించి కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బంగాళాదుంప టమాట కుర్మా తయారవుతుంది. దీనిని చపాతీ, పుల్కా, రోటి వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.