Aviri Kudumulu : మారుతున్న జీవనవిధానానికి అనుగుణంగా మన ఆహారపు అలవాట్లు కూడా మారుతూ వస్తున్నాయి. మన అమ్మమ్మ కాలంలో చేసిన చాలా వంటకాలను మనం ఇప్పుడు తయారు చేయడం లేదు. అలాంటి వాటిల్లో ఆవిరి కుడుములు కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో వీటిని తయారు చేయడమే మానేసారు. కానీ వీటిని తినడం వల్ల శరీరం బలంగా తయారవుతుంది. మన ఆరోగ్యానికి మేలు చేసే ఈ ఆవిరి కుడుములను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆవిరి కుడుములు తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు – ఒక కప్పు, బియ్యం – పావు కప్పు కంటే కొద్దిగా ఎక్కువ, ఉప్పు – తగినంత.
ఆవిరి కుడుములు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మినపప్పును, బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత ఇందులో తగినన్ని నీళ్లు పోసి 2 నుండి 3 గంటల పాటు నానబెట్టాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ ఆవిరి కుడుములకు పిండిని కొద్దిగా నీటిని పోసి గట్టిగా ఉండేలా అలాగే కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిలో తగినంత ఉప్పును వేసి 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ పిండిని పులియబెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో ఒక స్టాండ్ ను ఉంచి దానిపై మూతను పెట్టి నీటిని వేడి చేయాలి. తరువాత ఒక చిన్న గిన్నెను తీసుకుని అందులో బటర్ పేపర్ ను లేదా నీటిలో తడిపి పిండిన ఒక కాటన్ వస్త్రాన్ని ఉంచి దానిలో రెండు లేదా మూడు గంటెల పిండిని వేయాలి.
ఇప్పుడు ఈ గిన్నెను ముందుగా నీళ్లు పోసి సిద్దం చేసుకున్న గిన్నెలో స్టాండ్ మీద ఉంచి మూత పెట్టి ఉడికించాలి. దీనిని 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత గిన్నెను బయటికి తీసి దాని నుండి ఆవిరి కుడుమును బయటకు తీసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆవిరి కుడుములు తయారవుతాయి. వీటిని నెయ్యి, కారం పొడితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఆవిరి కుడుములు ఉడికించడానికి ప్రత్యేక పాత్ర ఉంటుంది. ఆ పాత్రలేని వారు పైన చెప్పిన పద్దతిలో ఆవిరి కుడుములను ఉడికించుకోవచ్చు. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది.