Fruit Salad : వేసవి కాలంలో మనం బయట ఎక్కువగా తినే వాటిల్లో ఫ్రూట్ సలాడ్ ఒకటి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఫ్రూట్ సలాడ్ లో పండ్ల ముక్కలు అధికంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయని చెప్పవచ్చు. బయట దొరికే ఫ్రూట్ సలాడ్ కి ఉండే రుచిలా ఇంట్లో కూడా మనం సులుభంగా దీన్ని తయారు చేసుకోవచ్చు. అందులో భాగంగానే ఫ్రూట్ సలాడ్ తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో.. దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రూట్ సలాడ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
యాపిల్ ముక్కలు- ఒక కప్పు, అరటి కాయ ముక్కలు – ఒకటిన్నర కప్పు, ద్రాక్ష – ఒక కప్పు, దానిమ్మ కాయ గింజలు – ఒక కప్పు, ఆరెంజ్ ముక్కలు – ఒక కప్పు, బొప్పాయి కాయ ముక్కలు – ఒక కప్పు, పాలు – అర లీటర్, కస్టర్డ్ పౌడర్ – 2 టీ స్పూన్స్, చక్కెర – 5 లేదా 6 టీ స్పూన్స్, మిల్క్ మెయిడ్ – 3 టీ స్పూన్స్.
ఫ్రూట్ సలాడ్ తయారు చేసే విధానం..
ముందుగా ఒక చిన్న గిన్నెలో కొన్ని పాలను పోసి, అందులో కస్టర్డ్ పౌడర్ ను వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిగిలిన పాలను ఒక గిన్నె లేదా కళాయిలో పోసి బాగా కాగనివ్వాలి. పాలు కాగిన తరువాత చక్కెరను వేసి చక్కెర కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ముందుగా ఉండలు లేకుండా చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ను వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మధ్యస్థ మంటపై 3 నిమిషాలు ఉడికించిన తరువాత మిల్క్ మెయిడ్ వేసి కలిపిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తరువాత ముందుగా సిద్దం చేసి పెట్టుకున్న పండ్ల ముక్కలును వేసి కలుపుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే ఫ్రూట్ సలాడ్ తయారవుతుంది. ఈ ఫ్రూట్ సలాడ్ లో ఇతర పండ్ల ముక్కలను, డ్రై ఫ్రూట్స్‌ను కూడా వేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఫ్రూట్ సలాడ్ ను 2 గంటలు ఫ్రిజ్ లో పెట్టిన తరువాత తింటే చాలా రుచిగా ఉంటుంది. వేసవి కాలంలో ఇలా తయారు చేసుకొని తినడం వల్ల శరీరం చల్లబడడమే కాకుండా.. పండ్లల్లో ఉండే పోషకాలన్నీ లభిస్తాయి.