Kakarakaya Ulli Karam : కాకరకాయలకు ఉండే చేదు కారణంగా వీటిని తినేందుకు చాలా మంది ఇష్ట పడరు. కానీ కాకరకాయల వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. షుగర్ వ్యాధిని నియంత్రించడంలో కాకరకాయలు ఎంతో సహాయపడతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచి, బరువు తగ్గడంలో దోహదపడతాయి. బి కాంప్లెక్స్ విటమిన్స్ కాకరకాయలలో అధికంగా ఉంటాయి. కనుక కాకరకాయలను కూడా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. కాకరకాయలతో కింద చెప్పిన విధంగా ఉల్లి కారం తయారు చేసుకోవడం వల్ల చేదు లేకుండా కాకరకాయలను రుచిగా తినవచ్చు. కాకరకాయ ఉల్లికారం తయారీకి కావల్సిన పదార్థాలను, తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ ఉల్లికారం తయారీకి కావల్సిన పదార్థాలు..
పొట్టిగా ఉన్న కాకర కాయలు – అర కిలో, పెద్దగా తరిగిన ఉల్లిపాయలు – రెండు కప్పులు, కారం – రుచికి సరిపడా, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – 4 టీ స్పూన్స్, పసుపు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, ధనియాలు – ఒక టీ స్పూన్, ఎండు మిర్చి – 2.
కాకరకాయ ఉల్లికారం తయారీ విధానం..
మొదటగా కాకరకాయలపై ఉండే చెక్కును తీసేసి శుభ్రంగా కడిగి చాకు సహాయంతో పొడ్డుగా, లోతుగా ఒక వైపు గాటు పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నీటిని పోసి కాకరకాయలను వేసి ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల చేదు ఉండదు. ఇప్పుడు ఒక జార్ లో తరిగిన ఉల్లిపాయలను, ఉప్పు, కారాన్ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక కళాయిలో నూనె వేసి కాగాక ఉడికించి పెట్టుకున్న కాకరకాయలను వేసి బాగా వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి, పసుపు, కరివేపాకు, ధనియాలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయలను వేసి ఉల్లిపాయ మిశ్రమం కాకరకాయలలోనికి వెళ్లేలా బాగా కలుపుకోవాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయలు చేదుగా అనిపించవు. చాలా రుచిగా ఉంటాయి. అంతే కాకుండా కాకరకాయలలో ఉండే పోషకాలు శరీరానికి లభిస్తాయి.