Palli Kobbari Chutney : మనం ఉదయం వంటింట్లో రకరకాల అల్పాహారాలను తయారు చేస్తూ ఉంటాం. అలాగే వాటిని తినడానికి చట్నీలని కూడా తయారు చేస్తూ ఉంటాం. ఈ చట్నీలని తయారు చేయడానికి ఎక్కువగా పల్లీలను ఉపయోగిస్తూ ఉంటాం. పల్లి చట్నీతో కలిపి తినడం వల్ల మనం తయారు చేసే అల్పాహారాల రుచి మరింత పెరుగుతుంది. ఈ పల్లి చట్నీలో కొబ్బరిని వేసి పల్లి కొబ్బరి చట్నీని మరింత రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లి కొబ్బరి చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – అర కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ధనియాలు – అర టీ స్పూన్, ఎండు మిరపకాయలు – 6 లేదా తగినన్ని, పుట్నాలు – 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు – 3, చింతపండు – 5 గ్రా., ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని.

తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, శనగ పప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, ఎండు మిర్చి – 1, కరివేపాకు – ఒక రెబ్బ.
పల్లి కొబ్బరి చట్నీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో పల్లీలను వేసి దోరగా వేయించి ఒక జార్ లోకి తీసుకోవాలి. అదే కళాయిలో నూనె వేసి నూనె వేడయ్యాక జీలకర్రను, ధనియాలను, ఎండు మిరపకాయలను వేసి రంగు మారే వరకు వేయించాలి. వీటిని వేయించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పుట్నాల పప్పును వేసి కలిపి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత వీటిని కూడా పల్లీలను తీసుకున్న జార్ లోకే తీసుకోవాలి.
ఇందులోనే వెల్లుల్లి రెబ్బలను, ఉప్పును, చింతపండును, కొబ్బరి ముక్కలను, తగినన్ని నీళ్లను పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తరువాత చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత తాళింపు పదార్థాలను వేసి తాళింపు చేసుకోవాలి. తరువాత ఈ తాళింపును చట్నీలో వేసి కలుపుకోవాలి. ఇలా తయారు చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పల్లి కొబ్బరి చట్నీ తయారవుతుంది. ఈ చట్నీని దోశ, ఇడ్లీ, ఊతప్పం, పునుగులు, ఉప్మా వంటి వివిధ రకాల అల్పాహారాలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.