Ponnaganti Kura : ప్రకృతి ప్రసాదించిన ఆకుకూరల్లో పొన్నగంటి కూర కూడా ఒకటి. ఈ ఆకుకూర మనకు గ్రామాల్లో విరివిరిగా లభిస్తుంది. పొన్నగంటి కూరలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ ఆకుకూర విశిష్టతను గ్రహించిన మన పెద్దలు దీనిని మన ఆహారంలో భాగంగా చేశారు. పొన్నగంటి కూరను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. పొన్నగంటి కూర వల్ల మన శరీరానికి కలిగే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో పిల్లలు 10 సంవత్సరాలకే కంటి చూపు మందగించడంతో అద్దాలను ఉపయోగిస్తున్నారు. కంటి సంబంధిత సమస్యలతో బాధపడే వారు తరచూ పొన్నగంటి కూరను తినడం వల్ల కొద్ది రోజులకే కళ్లజోడు పెట్టుకునే అవసరం లేనంతంగా కంటిచూపు మెరుగుపడుతుంది. ఈ ఆకుకూరను పూర్వకాలంలో పోయిన కంటి కూర అని పిలిచే వారు. అది కాస్త పొన్నగంటి కూరగా మారింది. పొన్నగంటి కూరలో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, ఫోలేట్, రైబోఫ్లేవిన్, కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

దీర్ఘకాలంగా దగ్గు, ఆస్తమా వంటి వాటితో బాధపడే వారు పొన్నగంటి కూర రసంలో వెల్లుల్లి రసాన్ని కలిపి తీసుకోవడం వల్ల చక్కని ఉపశమనం కలుగుతుంది. అలాగే బరువు పెరగడానికి, బరువు తగ్గడానికి రెండింటికి కూడా పొన్నగంటి కూర ఉపయోగపడుతుంది. పొన్నగంటి కూరను ఉడికించి అందులో మిరియాల పొడిని, ఉప్పును కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారని, కందిపప్పు, నెయ్యితో కలిపి పొన్నగంటి కూరను తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటును తగ్గించి గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా చేయడంలో కూడా పొన్నగంటి కూర మనకు సహాయపడుతుంది.
పొన్నగంటి కూరను తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా కండరాల నొప్పులు, నడుము నొప్పులు తగ్గుతాయి. పొన్నగంటి కూరలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. పొన్నగంటి కూరలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే గుణం కూడా ఉంటుంది. మధుమేహంతో బాధపడే వారు తరచూ ఆహారంలో పొన్నగంటి కూరను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.
లైంగిక సమస్యలను నయం చేయడంలో పొన్నగంటి కూర దివ్యౌషధంగా పని చేస్తుంది. శృంగారంపై ఆసక్తి లేకపోవడం, అంగస్తంభన, వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండడం వంటి లైంగిక సమస్యలతో బాధపడే వారు ఆహారంలో పొన్నగంటి కూరను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆవు నెయ్యితో ఈ ఆకుకూరను కలిపి వండుకుని తినడం వల్ల మొలల వ్యాధి నయం అవుతుంది. తరచూ దీనిని తినడం వల్ల చర్మ సమస్యలు తగ్గి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
పొన్నగంటి కూరను వండుకుని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి వాతావరణ మార్పుల కారణంగా వచ్చే రోగాల బారిన పడకుండా ఉంటాం. దీనిని తరచూ తినడం వల్ల క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా పొన్నగంటి కూర మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని, దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు.