Pappu Chekkalu : మనం పండగలకు అనేక రకాల పిండి వంటలను తయారు చేస్తూ ఉంటాం. వాటిలో పప్పు చెక్కలు కూడా ఒకటి. ఇవి ఎంత రుచిగా ఉంటాయో మనందరికీ తెలుసు. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభమే. ఈ పప్పు చెక్కలను కేవలం పండగల సమయంలోనే కాకుండా మనం ఎప్పుడుపడితే అప్పుడు వండుకుని నిల్వ చేసుకుని స్నాక్స్ గా కూడా తినవచ్చు. వీటిని తయారు చేసే విధానం అందరికీ తెలిసినప్పటికీ కొందరు ఎన్నిసార్లు ప్రయత్నించినా వాటిని కరకరలాడుతూ ఉండేలా తయారు చేసుకోలేక పోతారు. రుచిగా కరకరలాడుతూ ఉండేలా పప్పు చెక్కలను ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పప్పు చెక్కల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం పిండి – అర కిలో, పచ్చి మిరపకాయలు – 5 లేదా 6, కరివేపాకు – 2 రెబ్బలు, అల్లం ముక్క – 1 ( ఒక ఇంచు పరిమాణం), ఉప్పు – తగినంత, వెన్న – 3 టేబుల్ స్పూన్స్, నానబెట్టిన పెసర పప్పు – అర కప్పు, పసుపు – పావు టీ స్పూన్, వేడి నీళ్లు – తగినన్ని, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
పప్పు చెక్కల తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో పచ్చి మిరపకాయలను, కరివేపాకును, అల్లం ముక్కను వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో బియ్యం పిండిని తీసుకుని అందులో ఉప్పును, వెన్నను, నానబెట్టిన పెసర పప్పును, పసుపును, ముందుగా మిక్సీ పట్టిన పచ్చి మిరపకాయల మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. తరువాత తగినన్ని వేడి నీళ్లను పోసుకుంటూ మరీ మెత్తగా కాకుండా పిండిని కలుపుకోవాలి. తరువాత ఒక తడి వస్త్రాన్ని ఆ పిండిపై ఉంచి 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి.
తరువాత మందంగా ఉండే ఒక పాలిథీన్ కవర్ ను తీసుకుని దానికి నూనెను రాయాలి. ఇప్పుడు చేతికి నూనెను రాసుకుంటూ తగిన పరిమాణంలో పిండిని తీసుకుని గుండ్రంగా ముద్దగా చేయాలి. ఈ పిండి ముద్దను నూనె రాసిన పాలిథిన్ కవర్ మీద ఉంచి చేత్తో చెక్కల ఆకారంలో మరీ పలుచగా కాకుండా వత్తుకోవాలి. చేత్తో వత్తుకోవడం రాని వారు పూరీలను తయారు చేసే పరికరంతో కూడా ఈ చెక్కలను వత్తుకోవచ్చు. ఇప్పుడు ఒక కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత చెక్కలను ఒక్కొక్కటిగా వేస్తూ మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా కరకరలాడుతూ ఉండే పప్పు చెక్కలు తయారవుతాయి.
పప్పు చెక్కల తయారీలో వెన్నకు బదులుగా వేడి నూనెను కూడా ఉపయోగించవచ్చు. వీటిని ఎక్కువగా పండగలకు తయారు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఈ చెక్కలను తయారు చేసుకుని మనం స్నాక్స్ గా తినవచ్చు. బయట దొరికే చిరుతిళ్లను తినడానికి బదులుగా ఇంట్లోనే శుచిగా, మంచి నూనెలో కాల్చుకున్న ఈ పప్పు చెక్కలను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది.