Pudina Sharbat : పుదీనా ఆకులు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి సమస్త జీర్ణ రోగాలను హరించివేస్తాయి. కనుకనే జీర్ణ సమస్యలను తగ్గించేందుకు పుదీనా ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అలాగే ఇవి తలనొప్పిని తగ్గిస్తాయి. నోటిని తాజాగా ఉంచుతాయి. దీంతోపాటు శరీరంలోని వేడి మొత్తాన్ని తగ్గించేస్తాయి. పుదీనా ఆకులతో షర్బత్‌ను తయారు చేసి తాగడం వల్ల శరీరంలోని వేడి మొత్తం పోయి శరీరం చల్లగా మారుతుంది. అధిక వేడి సమస్య ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. ఇక పుదీనా షర్బత్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా షర్బత్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పుదీనా ఆకులు – 2 టీస్పూన్లు (తరిగినవి), నిమ్మకాయ – సగం ముక్క నుంచి తీసిన రసం, తేనె – ఒక టీస్పూన్, చక్కెర – ఒక టీస్పూన్, చల్లని నీళ్లు – ఒక గ్లాస్, జీలకర్ర పొడి – అర టీస్పూన్, నల్ల ఉప్పు – పావు టీస్పూన్, ఐస్ ముక్కలు – తగినన్ని.
పుదీనా షర్బత్ తయారీ విధానం..
ఒక గ్లాస్‌లో ముందుగా తగినన్ని ఐస్ ముక్కలను వేయాలి. అందులోనే నల్ల ఉప్పు, జీలకర్ర పొడి, తేనె, చక్కెర, నిమ్మరసం, పుదీనా ఆకులు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులోనే చల్లని నీళ్లను పోసి మళ్లీ కలపాలి. దీంతో పుదీనా షర్బత్ రెడీ అవుతుంది. ఇందులో పుదీనా ఆకులకు బదులుగా వాటి రసాన్ని కూడా వేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన పుదీనా షర్బత్‌ను తాగితే శరీరంలో ఎంత వేడి ఉన్నా సరే ఇట్టే తగ్గిపోయి శరీరం చల్లగా మారుతుంది. వేడి సమస్య ఉన్నవారు రోజూ దీన్ని తాగితే ఎంతో మేలు జరుగుతుంది.