Prawns Fry : రొయ్యలు.. వీటిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. రొయ్యలను తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. రొయ్యలతో మనం వివిధ రకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. రొయ్యలతో చేసే వంటకాల్లో రొయ్యల వేపుడు కూడా ఒకటి. రొయ్యల వేపుడు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. చాలా మంది రొయ్యల వేపుడును ఇష్టంగా తింటారు. తరచూ చేసే రొయ్యల వేపుడు కంటే కింద చెప్పిన విధంగా చేసే రొయ్యల వేపుడు మరింత రుచిగా ఉంటుంది. ఈ రొయ్యల వేపుడును ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రొయ్యల వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
శుభ్రపరిచిన రొయ్యలు – 400 గ్రా., నూనె – 3 టేబుల్ స్పూన్స్, లవంగాలు – 3, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, అనాస పువ్వు – 1, జాపత్రి – 1, బిర్యానీ ఆకు – 1, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మారినేషన్ కు కావల్సిన పదార్థాలు..
పసుపు – పావు టీ స్పూన్. కారం – 2 టీ స్పూన్స్ లేదా తగినంత, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, గరం మసాలా పొడి – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, తరిగిన ఉల్లిపాయలు – 2 ( మధ్యస్థంగా ఉన్నవి ), తరిగిన టమాటాలు – 2 ( మధ్యస్థంగా ఉన్నవి),ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్.
రొయ్యల వేపుడు తయారీ విధానం..
ముందుగా రొయ్యలను ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా శుభ్రపరుచుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అందులో మారినేషన్ కు కావల్సిన పదార్థాలన్నింటిని వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన తరువాత గిన్నెపై మూతను పెట్టి ఒక గంట పాటు పక్కకు ఉంచాలి. గంట తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత మారినేషన్ చేసుకున్న రొయ్యలను వేసి మధ్యస్థ మంటపై వేయించాలి. రొయ్యలలోని నీరు అంతా పోయి నూనె పైకి తేలే వరకు వేయించాలి.
తరువాత దీనిపై మూతను ఉంచి మరో 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత మూత తీసి చిన్న మంటపై రొయ్యలను కలుపుతూ బాగా వేయించాలి. ఇందులోనే కరివేపాకును కూడా వేసి వేయించాలి. రొయ్యలు బాగా వేగి వేపుడలా అయిన తరువాత కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రొయ్యల వేపుడు తయారవుతుంది. పప్పు చారు, పప్పు, రసం వంటి వాటితో కలిపి ఈ రొయ్యల వేపుడును తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే ఈ రొయ్యల వేపుడును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.