Chicken 65 : చికెన్ తో చేసే వంటకాలలో చికెన్ 65 ఒకటి. చికెన్ 65 మనకు బయట ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ 65 ను మనం ఇంట్లో కూడా చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. బయట దొరికే విధంగా ఉండే చికెన్ 65 ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ 65 తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా కట్ చేసిన బోన్ లెస్ చికెన్ – 300 గ్రా., మిరియాల పొడి – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒకటిన్నర టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్స్, మైదా పిండి – 2 టేబుల్ స్పూన్స్, కోడి గుడ్డు – 1, నిమ్మ రసం – ఒక టీ స్పూన్, ఉప్పు – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
మిశ్రమం చేయడానికి కావల్సిన పదార్థాలు..
నూనె – రెండు టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు – 6, చిన్నగా తరిగిన అల్లం – 20 గ్రా., జీలకర్ర – పావు టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – ఒకటి, రెడ్ చిల్లీ సాస్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్, టమాట సాస్ – 2 టేబుల్ స్పూన్స్, సోయా సాస్ – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – 100 ఎంఎల్, కారం – అర టీ స్పూన్, ఫుడ్ కలర్ – చిటికెడు.
చికెన్ 65 తయారీ విధానం..
ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి బాగా కలపాలి. తరువాత కళాయిలో నూనె వేసి కాగిన తరువాత అన్నీ వేసి కలిపి ఉంచిన చికెన్ ను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. తరువాత మరొక కళాయిలో నూనె వేసి అల్లం వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత చిల్లీ సాస్, టమాట సాస్, సోయా సాస్, కారం, ఫుడ్ కలర్ వేసి 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత నీళ్లను పోసి నీళ్లు మరిగిన తరువాత ముందుగా వేయించిన చికెన్ ను వేసి 10 నిమిషాల పాటు ఉడికించాలి. నీళ్లు ఎక్కువగా ఉంటే మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బయట దొరికే విధంగా ఉండే చికెన్ 65 తయారవుతుంది. చికెన్ తో తరచూ చేసే వంటకాలకు బదులుగా అప్పుడప్పుడూ ఇలా చేసుకుని కూడా తినవచ్చు.