Semiya Kheer : మనం సేమ్యాతో రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. సేమ్యాతో చేసుకోదగిన వంటకాల్లో సేమ్యా కీర్ ఒకటి. ఈ కీర్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. వంటరాని వారు చేసుకోవడానికి వీలుగా ఉండేలా చాలా తేలికగా, చాలా తక్కువ పదార్థాలతో, రుచిగా ఈ సేమ్యా కీర్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సేమ్యా కీర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
సేమ్యా – 100 గ్రా., పాలు – 500 ఎమ్ ఎల్, పంచదార – 100 గ్రా., డ్రై ఫ్రూట్స్ – తగినన్ని, యాలకుల పొడి – పావు టీ స్పూన్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్.
సేమ్యా కీర్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో సేమ్యా వేసి వేయించాలి. వీటిని మాడిపోకుండా రంగు మారే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక డ్రైఫ్రూట్స్ ను వేసి వేయించాలి. తరువాత ఒక పెద్ద గిన్నెను తీసుకుని అందులో పాలు పోసి ఒక పొంగు వచ్చే వరకు మరిగించాలి. పాలు మరిగిన తరువాత వేయించిన సేమ్యాను వేసి ఉడికించాలి. సేమ్యా ఉడికిన తరువాత పంచదారను వేయాలి. పంచదార కరిగే వరకు కలుపుతూ ఉడికించాలి.
పంచదార కరిగిన తరువాత వేయించిన డ్రైఫ్రూట్స్ ను, యాలకుల పొడిని వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సేమ్యా కీర్ తయారవుతుంది. ఈ సేమ్యా కీర్ వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా రుచిగా ఉంటుంది. ఈ సేమ్యా కీర్ ను అందరూ ఇష్టంగా తింటారు. తీపి తినాలనిపించినప్పుడు ఇలా చాలా త్వరగా అయ్యే సేమ్యా కీర్ ను తయారు చేసుకుని తినవచ్చు.