Tulsi Puja : మన దేశంలో పూజించే మొక్కల్లో తులసి మొక్క ఒకటి. ప్రతి హిందువు ఇంట్లో తులసి కోట ఉంటుంది. తులసి సాక్ష్యాత్తు మహాలక్ష్మీ స్వరూపం. అందుకే మహావిష్ణువుకు తులసి ఎంతో ప్రత్యేకమైనది. మన సనాతన ధర్మంలో తులసి ఎన్నో విధాలుగా స్తుతించారు. తులసి చెట్టు లేని ఇల్లు కళావిహీనంగా ఉంటుందని మన పెద్దలు చెబుతుంటారు. తులసి ఉన్న ఇల్లు పుణ్య తీర్థంతో సమానమని పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి ముందు నిత్యం దీపం పెట్టడమనేది మన కనీస ధర్మం. అలాగే తులసి ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. చాలా దేవాలయాల్లో తులసి తీర్థాన్నే ప్రసాదంగా ఇస్తారు.
ఉదయం లేచిన వెంటనే తులసి చెట్టును చూసినట్టయితే ములోకాల్లో ఉన్న సమస్థ తీర్థాలను దర్శించిన పుణ్య ఫలం కలుగుతుందని బ్రహ్మ పురాణం చెబుతుంది. తులసి మనస్సును, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. శారీరక, మానసిక ఆనందాన్ని ఇస్తుంది. తులసి చెట్టును, తులసి కోటను నిత్యం భక్తి శ్రద్దలతో పూజించాలి. నిత్యం నీళ్లు పోయాలి. ప్రదక్షిణలు చేయాలి. నమస్కరించాలి. దీని వల్ల అశుభాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయి. సర్వ పాపాలు తొలగిపోతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయం, సాయంత్రం తులసి కోట వద్ద దీపారాధన చేయడం వల్ల శుభాలు కలుగుతాయి. తులసి చెట్టు ఆవరణలో ఎటువంటి దుష్టశక్తులు పని చేయవు.
తులసి మొక్కను పూజించిన తరువాత 7, 11, 21 లేదా 111 సార్లు తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఇలాచేయడం వల్ల మొక్కలోని ఔషధ గుణాలు మనకు బాగా మేలు చేస్తాయి. తులసి చెట్టు దళాలను మంగళ, శుక్ర, ఆది వారాల్లో దాద్వశి, అమావాస్య, పూర్ణిమ తిధుల్లో, సంక్రాంతి జనన, మరణ సంవత్సరములలో తెంపకూడదు. తులసి లేకుండా భగవంతుని పూజ సంపూర్ణమైనట్టు కాదు. నిషిధ వారాల్లో, తిధుల్లో తులసి చెట్టు కింద రాలిన ఆకులతో పూజ చేయాలి. అలా వీలు కానీ పక్షంలో ముందు రోజే తులసి దళాలను సేకరించి మరుసటి రోజు పూజకు ఉపయోగించాలి. సాలగ్రామం ఉన్న వారు అన్నితిధుల్లో, వారాల్లో తులసి ఆకులను తెంపవచ్చు. ఎందుకంటే సాలగ్రామం విష్ణువు స్వరూపం. స్నానం చేయకుండా, పాదరక్షలు ధరించి తులసి ఆకులను తెంపకూడదు. అలాగే ఈ తులసి ఆకులను ఒక్కొక్కటిగా తెంపకూడదు.
రెండేసి ఆకులను కలిగిన కొసలను తెంపాలి. మొక్కను కదిలించకుండా తులసి ఆకులను తెంపాలి. పూజ చేసిన తరువాత అచ్యుతానంద గోవిందా అని స్మరిస్తూ నోట్లో వేసుకుని తినాలి. ప్రతిరోజూ భక్తి భావంతో ఒక తులసి దళాన్ని సేవించడం వల్ల సకల రోగాలు నశిస్తాయి. తులసిని స్త్రీలు కోయరాదు. పురుషులే కోయాలి. పూజ మాత్రం ఇరువురు చేయవచ్చు. పూజించే తులసి మొక్క దళాన్ని కోయరాదు. పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా పెంచిన తులసి మొక్క నుండి కోయాలి. కోట కట్టి పూజించే తులసి నుండి కోయరాదు. తులసి ఆకులను ఒడిలో పెట్టుకోకూడదు. ఈ ఆకులను ప్లేట్ లోకి కానీ, ఇతర చెట్టు ఆకుల్లోకి కానీ తీసుకోవాలి.
తులసి దళాన్ని ఒట్టి నేలపై ఉంచకూడదు. తులసి కోటకు రుతుక్రమంలో ఉన్న స్త్రీలు, వక్ర మార్గం, చెడు వ్యసనాలకు బానిసలైన స్త్రీలు, వేరే మతస్థులను పెళ్లి చేసుకున్న స్త్రీలు తులసి మొక్కను పూజించకూడదు. తులసి మొక్క ఆక్సిజన్ ను మాత్రమే తీసుకుని ఆక్సిజన్ ను వదులుతుంది. కాబట్టి తులసి మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని, అలాగే తులసి మొక్కను పూజించడం వల్ల మనం సకల సౌభాగ్యాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు.