Tomato Pappu : టమాటాలతో మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. వీటిల్లో విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కనుక టమాటాలను రోజువారి ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. పైగా ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే టమాటాలను చాలా మంది పప్పు రూపంలో వండుకుంటారు. కానీ రుచి బాగా రావడం లేదని వాపోతుంటారు. కానీ ఈ విధంగా టమాటా పప్పును తయారు చేస్తే.. రుచి అదిరిపోతుంది. రొట్టెలు.. లేదా అన్నంలో పప్పును లాగించేస్తారు. మరి రుచికరంగా టమాటా పప్పును ఎలా తయారు చేయాలో.. ఇప్పుడు తెలుసుకుందామా..!
టమాటా పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – అర కప్పు, శనగ పప్పు – అర కప్పు, నీళ్లు – మూడు కప్పులు, పసుపు – అర టీస్పూన్, బిర్యానీ ఆకు – ఒకటి, దాల్చిన చెక్క – చిన్న ముక్క, నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు, జీలకర్ర – ఒక టీస్పూన్, ఉల్లిపాయ – ఒకటి, టమాటాలు – రెండు, అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీస్పూన్, కారం – ఒక టీస్పూన్, ధనియాల పొడి – అర టీస్పూన్, గరం మసాలా – అర టీస్పూన్, ఉప్పు – తగినంత, ఆమ్చూర్ పొడి – అర టీస్పూన్, ఇంగువ – చిటికెడు, ఎండు మిర్చి – రెండు.
టమాటా పప్పు తయారీ విధానం..
రెండు రకాల పప్పులను కుక్కర్లో వేసి నీళ్లు పోసి 5 విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకుని తీసుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడి అయ్యాక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జీలకర్ర, అల్లం వెల్లుల్లి ముద్ద, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేయాలి. అన్నీ వేగాక తగినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఆమ్ చూర్ పొడి, ఉడికించి పెట్టుకున్న పప్పు వేసి బాగా కలిపి పప్పు ఉడుకుతున్నప్పుడు దింపేయాలి. ఇది అన్నంతోపాటు చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఇలాంటి టమాట పప్పును అందరూ తెగ లాగించేస్తారు..!