Cough : మనలో కొందరు తరచూ దగ్గుతో బాధపడడాన్ని లేదా దగ్గు ఎక్కువ కాలం పాటు ఉండడాన్ని చూడవచ్చు. తరుచూ దగ్గడం వల్ల మనతోపాటుగా ఎదుటి వారు కూడా ఇబ్బంది పడతారు. పిల్లల్లో కూడా తరచూ ఈ సమస్య వస్తుంటుంది. ఎక్కువగా దగ్గడం వల్ల గొంతు నొప్పి, ఛాతిలో, పక్కటెముకలలో నొప్పి వంటి ఇతర సమస్యలు కూడా వస్తుంటాయి. దగ్గు సమస్య నుండి బయట పడడానికి మనం రకరకాల యాంటీ బయాటిక్స్ ను వాడుతూ ఉంటాం. వీటిని తరచూ వాడడం వల్ల మన శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కనుక సాధారణ జ్వరం, జలుబు, దగ్గు తగ్గడానికి మనం యాంటీ బయాటిక్స్ ను ఎక్కువగా వాడకూడదు.
గొంతులో, ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కఫం కారణంగా మనకు దగ్గు వస్తుంది. దగ్గు సమస్యతో బాధపడే వారిలో గొంతు నొప్పి, రుచి తెలియక పోవడం, ఆకలిగా లేకపోవడం, పొట్టలో మందంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరం ఏదైనా వైరస్ ఇన్‌ఫెక్షన్స్ బారిన పడినప్పుడు కూడా మనం ఈ లక్షణాలను చూడవచ్చు. దగ్గు ప్రారంభం అవ్వడానికి ముందే (అనగా దగ్గుకు కారణమయ్యే వైరస్ వల్ల కలిగే ఇన్‌ఫెక్షన్ బారిన పడిన వెంటనే) మనకు గొంతు నొప్పి రావడం మొదలవుతుంది. ఇలా గొంతు నొప్పి వంటి లక్షణాలు రావడం మొదలయిన వెంటనే వేడి నీటిని తాగడం ప్రారంభించాలి.
రెండు లేదా మూడు రోజులు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా కేవలం వేడి నీళ్లు, తేనె, నిమ్మరసం కలిపిన నీటిని మాత్రమే తాగాలి. ఇలా చేయడం వల్ల వైరస్ వల్ల కలిగే ఇన్‌ఫెక్షన్ దగ్గుగా మారకుండా ఉంటుంది. లక్షణాలను గమనించకుండా ఇన్‌ఫెక్షన్ దగ్గుగా మారిన తరువాత కూడా ఇలా చేయడం వల్ల దగ్గు త్వరగా తగ్గుతుంది. దీంతోపాటు నీటి ఆవిరి పట్టడం, వేడి నీళ్ల స్నానం, వేడి నీటిలో తడిపిన గుడ్డను గొంతుపై పెట్టడం వంటివి చేయడం వల్ల చేయడం వల్ల గొంతు నొప్పి, దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.
ఆహారం తీసుకోని కారణంగా మన శరీరంలో ఎటువంటి జీవక్రియలు జరగవు. దీంతో శరీరంలో ఉండే రక్షణ వ్యవస్థ ఇన్‌ఫెక్షన్ ను తగ్గించడానికి ప్రయత్నిచడం వల్ల ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా అవ్వకుండా ఉంటుంది. ఇన్‌ఫెక్షన్ కారణంగానే మనలో కఫం, శ్లేష్మం తయారవుతుంది. ఇలా తయారయిన కఫాన్ని,శ్లేష్మాన్ని మన శరీరం దగ్గు రూపంలో బయటకు పంపిస్తుంది. ఎంత ఎక్కువగా కఫం, శ్లేష్మం మన శరీరంలో ఉంటుందో అన్ని ఎక్కువ రోజులు మనం దగ్గుతో బాధపడాల్సి వస్తుంది. కనుక ఆహారాన్ని తీసుకోకుండా కేవలం నీళ్లను మాత్రమే తాగడం వల్ల దగ్గు త్వరగా తగ్గుతుంది.
మూడు రోజుల తరువాత మిగిలిన ఇన్‌ఫెక్షన్ ను తగ్గించడానికి మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి మిగిలిన సమయంలో తేనె నీళ్లను తాగుతూ ఉండాలి. రాత్రి సమయంలో దగ్గు ఎక్కువగా రావడానికి కారణం.. మనం రోజంతా తిన్న ఆహారం రాత్రికి జీర్ణమవుతుంది. దీంతో శరీరంలో జీవక్రియలు తగ్గి, శరీరంలో ఉండే రక్షణ వ్యవస్థ అంతా ఇన్‌ఫెక్షన్ వల్ల తయారయిన కఫాన్ని, శ్లేష్మాన్ని దగ్గు రూపంలో బయటకు పంపిస్తుంది. దీని కారణంగా రాత్రి సమయంలో దగ్గు ఎక్కువగా వస్తుంది. కనుక పైన చెప్పిన విధంగా చేయడం వల్ల దగ్గు ఎక్కువ రోజులు ఉండకుండా చూసుకోవచ్చు.