Veg Fried Rice : మనకు బయట హోటల్స్ లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలలో ఎక్కువగా దొరికే వాటిల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా ఒకటి. దీనిని చాలా మంది రుచి చూసే ఉంటారు. వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. ఈ ఫ్రైడ్ రైస్ ను చాలా మంది ఇష్టంగా తింటారు. బయట దొరికే విధంగా ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ ను మనం ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాస్మతి బియ్యం – 200 గ్రాములు, నూనె – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు – 6, చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు – ఒక కప్పు, చిన్నగా తరిగిన బీన్స్ – ఒక కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన క్యాబేజీ – ఒక కప్పు, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, సోయా సాస్ – ఒక టీ స్పూన్, చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, వెనిగర్ – ఒక టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు – కొద్దిగా.
వెజ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం..
ముందుగా బాస్మతి బియ్యంలో కొద్దిగా ఉప్పును, నూనెను వేసి తగినన్ని నీళ్లు పోసి పొడి పొడిగా ఉండేలా వండుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత వెల్లుల్లి రెబ్బలను వేసి మధ్యస్థ మంటపై వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత క్యారెట్ ముక్కలను, బీన్స్ ముక్కలను, తరిగిన ఉల్లిపాయలను, క్యాబేజీని రెండు నిమిషాల తేడాతో ఒక దాని తరువాత ఒకటిగా వేసి వేయించుకోవాలి. ఈ ముక్కలను పూర్తిగా వేయించకూడదు. కొద్దిగా పచ్చిగా ఉండేలా వేయించుకోవాలి.
ఇలా వేయించిన తరువాత మిరియాల పొడిని, ఉప్పును వేసి కలపాలి. తరువాత ఉడికించుకున్న బాస్మతీ అన్నాన్ని వేయాలి. ఇందులోనే సోయాసాస్, చిల్లీ సాస్, వెనిగర్ ను వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు ఉంచి చివరగా ఉల్లికాడలను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వల్ల బయట దొరికే విధంగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ తయారవుతుంది. ఈ ఫ్రైడ్ రైస్ తయారీలో సాధారణ బియ్యాన్ని కూడా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా పచ్చి బఠాణీని, క్యాప్సికమ్ ను కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా బయట దొరికే విధంగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ ను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.