Mamidikaya Turumu Pachadi : మామిడికాయల సీజన్ రానే వచ్చింది.. ఇప్పటికే మామిడికాయలు మనకు మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చాయి. వీటితో మనం పప్పు, పచ్చళ్లు, పులిహోర వంటి వాటిని తయారు చేస్తూనే ఉన్నాం. మామిడికాయ పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో మనందరికి తెలిసిందే. మామిడికాయలతో మనం ముక్కల పచ్చడితో పాటు మామిడికాయ తురుము పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటాం. మామిడికాయ తురుము పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. మామిడికాయ ముక్కల పచ్చడి కంటే తురుము పచ్చడిని తయారు చేయడం చాలా తేలిక. మొదటిసారి చేసే వారు, వంటరాని వారు కూడా ఈ మామిడికాయ తురుము పచ్చడిని సులభంగా తయారు చేసుకోవచ్చు. మామిడికాయలతో కేవలం పది నిమిషాల్లోనే తురుము పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మామిడికాయ తురుము పచ్చడి తయారీ విధానం..
మామిడికాయ తురుము – 2 కప్పులు, కారం – 1/3 కప్పు, నూనె – ముప్పావు కప్పు, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, ఇంగువ – పావు టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – 3 టేబుల్ స్పూన్స్, ఆవపిండి – ఒక టేబుల్ స్పూన్, మెంతిపిండి – అర టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్.
మామిడికాయ తురుము పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగవు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కరివేపాకు వేసి నూనె చల్లగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత కారం, ఉప్పు, పసుపు, ఆవపిండి, మెంతి పిండి వేసి కలపాలి. తరువాత మామిడికాయ తురుము వేసి కలపాలి. దీనిని గంటపాటు అలాగే ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఈ పచ్చడిని గాజు సీసాలో లేదా జాడీలో ఉంచి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని అందరూ లొట్టలేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు. మామిడికాయ ముక్కల పచ్చడి పెట్టడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఆ లోపు మనం ఇలా తురుము పచ్చడిని తయారు చేసుకుని తినవచ్చు.