Meal Maker Pulao : సోయా గింజలతో చేసే మీల్ మేకర్ లను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మీల్ మేకర్ లలో కూడా మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. మీల్ మేకర్ లతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఈ మీల్ మేకర్ లతో చేసుకోదగిన వంటకాల్లో మీల్ మేకర్ పులావ్ కూడా ఒకటి. ఈ పులావ్ చికెన్ పులావ్ అంత రుచిగా ఉంటుంది. ఈ పులావ్ ను తయారు చేయడం కూడా చాలా సులభం. మీల్ మేకర్ లతో రుచిగా పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మీల్ మేకర్ పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మీల్ మేకర్ – 50 గ్రా., నానబెట్టిన బియ్యం – అర కిలో, తరిగిన బంగాళాదుంప – 1, తరిగిన క్యారెట్ – 1, తరిగిన పచ్చిమిర్చి – 3, తరిగిన టమాట – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, పెరుగు – 3 టేబుల్ స్పూన్స్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా.
మసాలా దినుసులు..
సాజీరా – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, మరాఠి మొగ్గ – 1, లవంగాలు – 3, యాలకులు – 3.

మీల్ మేకర్ పులావ్ తయారీ విధానం..
ముందుగా మీల్ మేకర్ లలో నీళ్లు పోసి 10 నిమిషాల పాటు నానబెట్టాలి. తరువాత నీళ్లు పిండేసి మీల్ మేకర్ ను పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత క్యారెట్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, పచ్చిమిర్చి, టమాట ముక్కలు వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. ఇలా వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, మీల్ మేకర్ వేసి వేయించాలి. తరువాత నానబెట్టుకున్న బియ్యం, కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. తరువాత ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ నీళ్ల చొప్పున వేసి కలపాలి.
దీనిని మధ్యస్థ మంటపై 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించిన తరువాత పులావ్ దగ్గర పడుతుంది. తరువాత దీనిపై మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తరువాత 5 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ పులావ్ తయారవుతుంది. వీకెండ్స్ లో, ప్రతేక సందర్భాల్లో ఇలా మీల్ మేకర్ తో పులావ్ ను తయారు చేసుకుని తినవచ్చు. ఈ పులావ్ ను ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.