Menthikura Podi Pappu : మెంతికూరను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మెంతికూర మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మెంతికూరను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. బరువు తగ్గడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేయడంలో, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఈ మెంతికూర మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇతర వంటకాల్లో వాడడంతో పాటు ఈ మొంతికూరతో మనం మెంతి పరోటా, మెంతి పులావ్ వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటాం. ఈ మెంతికూరతో మనం పొడి పప్పు కూరను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ మెంతికూర పొడి పప్పును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతికూర పొడి పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
మెంతికూర – 2 కట్టలు, కందిపప్పు – 2 టీ గ్లాసులు, నూనె – 3 టీ స్పూన్స్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్.
మెంతికూర పొడి పప్పు తయారీ విధానం..
ముందుగా మెంతికూరను తరిగి శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. తరువాత గిన్నెలో కంది పప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి కందిపప్పును ఉడికించాలి. పప్పు మరీ ముద్దగా కాకుండా చూసుకోవాలి. పప్పు మెత్తగా ఉడకగానే స్టవ్ ఆఫ్ చేసి వడకట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత మెంతికూరను వేసి దగ్గర పడే వరకు కలుపుతూ వేయించాలి. మెంతికూర చక్కగా వేగిన తరువాత ఉడికించుకున్న పప్పును వేసి కలపాలి. దీనిని తడి పోయే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మెంతికూర పొడి పప్పు తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటి వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ మెంతికూర పొడి పప్పు కూరను తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.