Onion Rice : ఉల్లిపాయలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని ప్రతి వంట గదిలోనూ విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటారు. ఉల్లిపాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని వంటల్లో వాడడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. ఇతర వంటల్లో వాడడంతో పాటు ఉల్లిపాయలతో కూరలు, చిరుతిళ్లు, ఇతర ఆహార పదార్థాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఉల్లిపాయలతో ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆనియన్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – 250 గ్రా., పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 3, తరిగిన పచ్చిమిర్చి – 4, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, వెల్లుల్లి తరుగు – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.

ఆనియన్ రైస్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉప్పు, కారం, గరం మసాలా వేసి కలపాలి. తరువాత పసుపు వేసి కలపాలి. ఇప్పుడు అన్నాన్ని వేసి కలపాలి. దీనిని మధ్యస్థ మంటపై 3 నిమిషాల పాటు కలుపుకోవాలి. చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆనియన్ రైస్ తయారవుతుంది. దీనిని చల్లారిన తరువాత కంటే వేడి వేడిగా తింటేనే చాలా రుచిగా ఉంటుంది. వంట ఏం చేయాలో తోచనప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, దవంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా ఉల్లిపాయలతో రైస్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.