Methi Chapati : మనం గోధుమలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని పిండిగా చేసి చపాతీలతో పాటు వివిధ రకాల రోటీలను, పరోటాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. గోధుమపిండితో చేయదగిన వాటిల్లో మేతి మసాలా రోటీలు కూడా ఒకటి. కసూరి మెంతిని ఉపయోగించి ఈ రోటీలు ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు రుచిగా కూడా ఉంటాయి. చాలా సులభంగా ఈ మేతి మసాలా రోటీలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మేతి మసాలా రోటి తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమ పిండి – ఒక కప్పు, ఉప్పు – తగినంత, కసూరి మెంతి – 2 టేబుల్ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, పంచదార – చిటికెడునూనె – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – తగినన్ని.
మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
వాము – అర టీ స్పూన్, ధనియాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, శొంఠి – పావు ఇంచు ముక్క, లవంగాలు – 2, దాల్చిన చెక్క ముక్క – 1, ఎండుమిర్చి – 1.

మేతి మసాలా రోటి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు వేసి కొద్దిగా వేయించాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, పంచదార, కసూరి మెంతి, పసుపు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. తరువాత పిండిని తీసుకుని కావల్సిన పరిమాణంలో ముద్దలుగా చేసుకోవాలి.
ఇప్పుడు ఒక్కో ముద్దను తీసుకుంటూ పొడి చల్లుకుంటూ చపాతీలా రుద్దుకోవాలి. తరువాత స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడాయ్యక మేతి రోటిని వేసి నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మేతి మసాలా రోటి తయారవుతుంది. ఈ రోటీలు రెండు నుండి మూడు రోజుల వరకు పాడవకుండా తాజాగా ఉంటాయి. ఈ మేతి మసాలా రోటీలను మనం ఇంట్లో చేసుకునే కూరలతో, పచ్చళ్లతో, పెరుగుతో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి.