Milk Powder : మిల్క్ పౌడర్.. పాలకు ప్రత్యమ్నాయంగా చాలా మంది దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. టీ, కాఫీ వంటి వాటి తయారీలో, కొన్ని రకాల తీపి వంటకాల్లో మిల్క్ పౌడర్ ను వాడుతూ ఉంటారు. పాలు లభించని పరిస్థితుల్లో పాలపొడిని తీసుకుని నీళ్లు కలిపి పాల లాగా కూడా ఉపయోగించుకోవచ్చు. మనకు మార్కెట్ లో వివిధ కంపెనీల మిల్క్ పౌడర్ లభిస్తూ ఉంటుంది. మిల్క్ పౌడర్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని నేరుగా తింటూ ఉంటారు. అయితే బటట కొనే పని లేకుండా ఈ మిల్క్ పౌడర్ ను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. పాలు ఉంటే చాలు ఈ పాలపొడిని చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసి వాడుకోవచ్చు. పాలతో రుచిగా ఇంట్లోనే పాలపొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మిల్క్ పౌడర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
టోన్డ్ మిల్క్ – ఒక లీటర్, పంచదార పొడి – 3 నుండి 4 టేబుల్ స్పూన్స్.
మిల్క్ పౌడర్ తయారీ విధానం..
ముందుగా అడుగు మందంగా ఉండే కళాయిని తీసుకుని నీటితో కడగాలి. తరువాత ఇందులో పాలు పోసి వేడి చేయాలి. ఈ పాలను అడుగు పట్టకుండా కలుపుతూ మరిగించాలి. వీటిని మధ్యస్థ మంటపై 40 నుండి 45 నిమిషాల పాటు దగ్గర పడే వరకు మరిగించాలి. ఇలా మరిగించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మలైను బటర్ పేపర్ మీద వేసుకోవాలి. తరువాత దీనిని వీలైనంత పలుచగా చేసుకోవాలి. ఈ మలైను ఒక రోజంతా ఎండలో ఉంచాలి. మలై ఎండిన తరువాత దీనిని మరో వైపుకు ఉంచి మరలా రోజంతా ఎండబెట్టాలి. మలై తడి లేకుండా పూర్తిగా ఎండిన తరువాత వీటిని జార్ లో వేసుకుని మెత్తని పొడిగా చేసుకోవాలి. తరువాత ఇదే జార్ లో పంచదార పొడి వేసి మరలా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పౌడర్ ను జల్లెడలో వేసి జల్లించాలి. జల్లించగా వచ్చిన పౌడర్ ను మరలా నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మిల్క్ పౌడర్ తయారవుతుంది. ఇలా ఇంట్లోనే సులభంగా పాలపొడిని తయారు చేసుకుని ఉపయోగించుకోవచ్చు.