Minapa Chekkalu : మనం వంటింట్లో తయారు చేసే పిండి వంటకాల్లో చెక్కలు కూడా ఒకటి. చెక్కలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని ఎక్కువగా బియ్యంపిండితో తయారు చేస్తూ ఉంటాము. కేవలం బియ్యంపిండితో కాకుండా మినపప్పుతో కూడా మనం చెక్కలను తయారు చేసుకోవచ్చు. మినపప్పుతో చేసే ఈ చెక్కలు చాలా రుచిగా, క్రిస్సీగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. మినపప్పుతో చెక్కలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మినప చెక్కల తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపగుళ్లు – అర కప్పు, బియ్యం – 2 కప్పులు, ఉప్పు – తగినంత, జీలకర్ర – 2 టీ స్పూన్స్, చిల్లీ ప్లేక్స్ – 2 టీ స్పూన్స్, ఇంగువ – పావు టీ స్పూన్, కరిగించిన బటర్ – 3 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన కరివేపాకు – 2 రెమ్మలు, తరిగిన కొత్తిమీర – 3 టేబుల్ స్పూన్స్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
మినప చెక్కల తయారీ విధానం..
ముందుగా కళాయిలో మినపగుళ్లను వేసి దోరగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని గిన్నెలోకి తీసుకుని అందులోనే బియ్యం వేసి మెత్తగా మర ఆడించుకోవాలి. తరువాత పిండిని గిన్నెలోకి తీసుకుని అందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలు వేసి కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తరువాత దీనిపై తడిపిన వస్త్రాన్ని ఉంచి 20 నిమిషాల పాటు పిండిని నానబెట్టాలి. తరువాత పిండిని తీసుకుంటూ చిన్న ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుంటూ చేత్తో లేదా పూరీ మిషిన్ తో చెక్క లాగా వత్తుకుని వస్త్రంపై వేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చెక్కలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మినప చెక్కలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల నెల రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసిన చెక్కలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.