Minapa Pappu Annam : మనం ప్రతిరోజూ ఆహారంగా అన్నాన్ని తింటూ ఉంటాం. కూరలతో తినడంతో పాటు అన్నంతో మనం వివిధ రకాల రైస్ డిషెస్ ను కూడా తయారు చేస్తూ ఉంటాం. అన్నంతో మనం సులభంగా, రుచిగా తయారు చేసుకోగలిగిన రైస్ డిషెస్ ల్లో మినపప్పు అన్నం కూడా ఒకటి. ఇది ఒక పాతకాలపు వంటకం. మినపప్పుతో చేసే ఈ అన్నం చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ ల్లోకి కూడా ఈ అన్నం చక్కగా ఉంటుంది. బ్యాచిలర్స్, మొదటిసారి చేసే వారు ఇలా ఎవరైనా దీనిని తేలికగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే మినపప్పు అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మినపప్పు అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, పొట్టు మినపప్పు – పావు కప్పు, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 8 నుండి 10, పచ్చి కొబ్బరి ముక్కలు – పావు కప్పు, చింతపండు – ఒక రెమ్మ, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఇంగువ – కొద్దిగా, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, అన్నం – ఒక కప్పు బియ్యంతో వండినంత.
మినపప్పు అన్నం తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక మినపప్పు వేసి ఎర్రగా వేయించాలి. తరువాత ఎండుమిర్చి, ధనియాలు వేసి వేయించాలి. తరువాత పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే చింతపండును కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో మరో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పొడి, ఉప్పు వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని అన్నంలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మినపప్పు అన్నం తయారవుతుంది. మిగిలిన అన్నంతో లేదా అప్పుడే వండిన అన్నంతో కూడా ఈ రైస్ ను తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మినపప్పుతో చేసిన అన్నాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.