Murmure Laddu : మరమరాలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మరమరాలతో చేసే ఎటువంటి వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా వీటితో ఉగ్గాణిని తయారు చేస్తూ ఉంటాం. ఇదే ఈ మరమరలాతో మనం ఎంతో రుచిగా ఉండే లడ్డూను కూడా తయారు చేసుకోవచ్చు. మరమరాల లడ్డూను మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఇవి ప్రస్తుత కాలంలో బయట ఎక్కువగా దొరకడం లేదు. ఈ లడ్డూలను మనం ఇంట్లో కూడా చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. కేవలం రెండు పదార్థాలను ఉపయోగించి మనం వీటిని తయారు చేసుకోవచ్చు. మరమరాల లడ్డూను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మరమరాల లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
మరమరాలు – 120 గ్రా., బెల్లం తురుము – 150 గ్రా., నీళ్లు – ఒక టీ స్పూన్.
మరమరాల లడ్డూ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో బెల్లం తురుము, నీళ్లు వేసి వేడి చేయాలి. బెల్లం కరిగి ముదురు పాకం వచ్చే వరకు దీనిని ఉడికించాలి. ఒక గిన్నెలో బెల్లం మిశ్రమాన్ని వేసి చూస్తే అది గట్టిగా ముద్దగా అవ్వాలి. ఇలా తయారవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి బెల్లం మిశ్రమాన్ని అంతా మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు మరమరాలను వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. బెల్లం మిశ్రమం కొద్దిగా చల్లారిన తరువాత చేతికి కొద్దిగా తడి చేసుకుంటూ తగిన మోతాదులో కొద్ది కొద్దిగా మరమరాల మిశ్రమాన్ని తీసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మరమరాల లడ్డూలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి.వీటిని పిల్లలు మరింత ఇష్టంగా తింటారు. ఇలా మరమరాలతో లడ్డూలను చేసుకుని తినడం వల్ల రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటుంది.