Musk Melon Laddu : కర్బూజ.. మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో ఇది కూడా ఒకటి. కర్బూజను తినడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. బరువు తగ్గడంలో, శరీరానికి కావల్సిన పోషకాలను అందించడంలో, శరీరానికి చలువ చేయడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా కర్బూజ మనకు సహాయపడుతుంది. దీనితో ఎక్కువగా జ్యూస్, మిల్క్ షేక్స్, సలాడ్స్ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా కర్బూజతో మనం ఎంతో రుచిగా ఉండే లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చు. కర్బూ. లడ్డూలను తయారు చేయడం చాలా సులభం. వంటరాని వారు కూడా వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. కర్బూజతో రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మస్క్ మెలన్ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
డ్రై ఫ్రూట్స్ పొడి – ఒక కప్పు, పాల పొడి – 5 టేబుల్ స్పూన్స్, పంచదార – ఒక కప్పు, ఎండు కొబ్బరి పొడి – ఒక కప్పు, కర్బూజ – 1.

మస్క్ మెలన్ లడ్డూ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో కర్బూజ ముక్కలను తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో ఈ కర్బూజ మిశ్రమాన్ని పోసి కలుపుతూ ఉడికించాల. ఈ మిశ్రమం ఉడుకు పట్టగానే పంచదార వేసి కలపాలి. పంచదార కరిగిన తరువాత డ్రై ఫ్రూట్స్ పొడి వేసి కలపాలి. తరువాత పాలపొడి వేసి కలపాలి. దీనిని ఉండలు లేకుండా కలుపుకున్న తరువాత కలుపుతూ దగ్గర పడే వరకు ఉడికించాలి. ఈ మిశ్రమం దగ్గర పడిన తరువాత కొబ్బరి పొడి, యాలకుల పొడి వేసి కలపాలి.
తరువాత దీనిని కళాయికి అంటుకోకుండా వేరయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తరువాత చేతులకు నెయ్యిరాసుకుంటూ కావల్సిన పరిమాణంలో లడ్డూలుగా చుట్టుకోవాలి. తరువాత వీటికి ఎండు కొబ్బరి పొడితో కోటింగ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మస్క్ మెలన్ లడ్డూ తయారవుతుంది. ఇవి చూడడానికి కలర్ ఫుల్ గా చాలా చక్కగా ఉంటాయి కనుక పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.