Liver Failure Symptoms : మన శరీరం లోపలి భాగంలో ఉండే అవయవాల్లో లివర్ అతిపెద్ద అవయవం. ఇది రోజూ నిరంతరాయంగా అనేక విధులను నిర్వర్తిస్తుంది. జీవక్రియలను నిర్వహించడం, తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడం, శరీరానికి శక్తిని అందించడం, వ్యర్థాలను బయటకు పంపడం, పోషకాలను శోషించుకోవడం.. వంటి అనేక పనులు చేస్తుంది. అయితే చాలా మంది పాటిస్తున్న అస్తవ్యస్తమైన అలవాట్లు, జీవన విధానం వల్ల లివర్ డ్యామేజ్ అవుతోంది. లివర్ వ్యాధులు అధికంగా వస్తున్నాయి. మద్యం విపరీతంగా సేవించడం ఇందుకు ప్రధాన కారణం అని చెప్పవచ్చు.
అయితే లివర్ వ్యాధి వస్తే ఆరంభంలోనే లక్షణాలు కనిపిస్తాయి. కానీ వీటిని అందరూ గుర్తు పట్టలేరు. అయితే లివర్ డ్యామేజ్ మరింత పెరిగే కొద్దీ ఆ లక్షణాలు మరింత ఎక్కువగా కనిపిస్తాయి. కనుక అలాంటి స్థితిలో తప్పనిసరిగా ఎవరైనా సరే జాగ్రత్త వహించాల్సిందే. ఇక లివర్ చాలా వరకు డ్యామేజ్ అయితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
లివర్ చాలా వరకు డ్యామేజ్ అయితే చర్మం అంతా పసుపు రంగులోకి మారిపోతుంది. కళ్లు కూడా పసుపు రంగులో కనిపిస్తాయి. రక్తంలో బైలిరుబిన్ స్థాయిలు అధికం కావడం వల్ల ఇలా జరుగుతుంది. పొట్ట దగ్గర చర్మం కింద కొన్ని రకాల ద్రవాలు పేరుకుపోతాయి. దీంతో పొట్ట విపరీతంగా ఉబ్బిపోయి కనిపిస్తుంది. బాగా లావుగా దర్శనమిస్తుంది. ఇలా కనిపిస్తే లివర్ దాదాపుగా చెడిపోయినట్లు భావించాలి. లివర్ డ్యామేజ్ అయితే పాదాలు, మడమల్లో వాపులు వస్తాయి. అక్కడంతా ద్రవాలు నిండిపోతాయి. కనుకనే అలా జరుగుతుంది. ఆ ప్రదేశాల్లో వేలితో నొక్కితే సొట్ట పడి లోపలికి చర్మం వెళ్లిపోతుంది. ఇలా కనిపిస్తే వెంటనే అప్రమత్తమవ్వాల్సిదే. లేదంటే ఇబ్బందుల్లో పడిపోతారు.
లివర్ ఫెయిల్యూర్ అయితే బ్లడ్ క్లాట్ అయ్యేందుకు అవసరమయ్యే ప్రోటీన్ల ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో శరీరంలో అంతర్గతంగా ఎక్కడైనా బ్లీడింగ్ అయ్యే చాన్స్ ఉంటుంది. ఇది చాలా ప్రమాదం. ఇలా జీర్ణాశయం వద్ద అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లివర్ ఫెయిల్యూర్ అనేది మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపిస్తుంది. మానసికంగా కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. శరీరంలో టాక్సిన్లు పేరుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంది. దీంతో ఆందోళన పెరుగుతుంది. కంగారు పడిపోతుంటారు. అయితే ఇది మరీ అదుపు తప్పితే కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది.
లివర్ చెడిపోతే తీవ్రమైన అలసట, నీరసం ఉంటాయి. చిన్న పని చేసినా విపరీతంగా అలసిపోతారు. ఇది రోజువారీ పనులపై కూడా ప్రభావం చూపిస్తుంది. లివర్ చెడిపోతే చాలా సులభంగా గాయాలు అవుతాయి. సులభంగా బ్లీడింగ్ కూడా అవుతుంది. అది ఒక పట్టాన ఆగదు. దీంతో తీవ్రమైన రక్తస్రావం అయి ప్రాణాల మీదకు కూడా వస్తుంది. కనుక ఇలా జరిగితే వెంటనే జాగ్రత్త పడాల్సిందే. లివర్ చెడిపోయిన వారికి జీర్ణవ్యవస్థ పనితీరు సరిగ్గా ఉండదు. దీంతో ఆకలి ఉండదు. బరువు తగ్గుతూనే ఉంటారు. లివర్ చెడిపోతే శరీరంలో బైల్ సాల్ట్స్ అలాగే పేరుకుపోతాయి. దీంతో చర్మం దురదగా అనిపిస్తుంది. దద్దుర్లు కూడా వస్తుంటాయి.
కనుక పై లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే వారి లివర్ బాగా చెడిపోయిందని అర్థం చేసుకోవాలి. వెంటనే డాక్టర్‌ను కలిసి లివర్‌కు సంబంధించిన అన్ని పరీక్షలను చేయించుకోవాలి. ఏదైనా సమస్య ఉందని తేలితే వెంటనే చికిత్స ప్రారంభించవచ్చు. లేదంటే అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారవుతారు. కనుక ఈ లక్షణాల పట్ల ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాల్సిందే.