Muskmelon Salad : మనం ఏడాది పొడవునా వచ్చే సీజన్లను బట్టి భిన్న రకాల ఆహారాలను తింటుంటాం. చలికాలంలో వేడినిచ్చేవి.. వేసవిలో చల్లదనాన్నిచ్చే ఆహారాలను తీసుకుంటుంటాం. అయితే మనం వేసవిలో మాత్రమే తినే వాటిలో తర్బూజలు కూడా ఒకటి. వాస్తవానికి ఇవి మనకు ఎప్పుడైనా సరే లభిస్తాయి. అందువల్ల వీటిని కేవలం వేసవిలో మాత్రమే కాదు.. ఏ సీజన్‌లో అయినా సరే తినవచ్చు. ఇక తర్బూజలను చాలా మంది జ్యూస్ చేసుకుని తాగుతుంటారు. లేదా ముక్కలుగా కట్ చేసి చక్కెర చల్లి తింటారు. కానీ వీటితో ఎంతో రుచికరమైన సలాడ్‌ను కూడా చేసుకోవచ్చు. ఇది అందరికీ నచ్చుతుంది. చేయడం కూడా సులభమే. తర్బూజలతో సలాడ్‌ను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తర్బూజ సలాడ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
తర్బూజ – 1 (పెద్దది), బొప్పాయి ముక్కలు – కొన్ని, నిమ్మరసం – పావు కప్పు, పచ్చి మిర్చి – 1, ఆవాల పేస్ట్ – 1 టీస్పూన్, మిరియాలు – కొద్దిగా, చక్కెర – పావు కప్పు, ఉప్పు – తగినంత.
తర్బూజ సలాడ్‌ను తయారు చేసే విధానం..
ఒక పాత్రలో కొద్దిగా నీళ్లు పోసి చక్కెర, నిమ్మరసం, పచ్చి మిర్చి వేసి మరిగించాలి. చల్లారిన తరువాత వడకట్టి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తర్బూజ, బొప్పాయి పండ్లను ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు పండ్ల ముక్కలపై ఫ్రిజ్‌లో పెట్టుకున్న మిశ్రమం పోయాలి. తరువాత ఆవాల పేస్ట్, మిరియాల పొడి చల్లాలి. రుచికి తగినంత ఉప్పు వేయాలి. చల్ల చల్లగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే తర్బూజా సలాడ్ టేస్టీగా ఉంటుంది. ఇది అందరికీ నచ్చుతుంది. ఎంతో ఇష్టంగా తింటారు. ఈసారి తర్బూజాలను తెస్తే ఇలా కొత్తగా ట్రై చేయండి. బాగుంటుంది.