Gas Trouble : ప్రస్తుత తరుణంలో చాలా మంది గ్యాస్ ట్రబుల్ సమస్యతో అవస్థలు పడుతున్నారు. భోజనం చేసినా చేయకపోయినా గ్యాస్ ఉత్పత్తి అవుతూ ఇబ్బందులకు గురి చేస్తోంది. కొందరికైతే ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇంగ్లిష్ మెడిసిన్ వాడాల్సిన పనిలేకుండానే పలు సహజసిద్ధమైన చిట్కాలను పాటించడం వల్ల గ్యాస్ ట్రబుల్ నుంచి ఉపశమనం పొందవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రెండు కప్పుల నీళ్లను తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ సోంపు గింజలను వేయాలి. ఈ నీటిని సన్నని మంటపై ఒక కప్పు అయ్యే వరకు మరిగించాలి. అనంతరం ఈ నీటిని వడకట్టి గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగేయాలి. ఇలా రోజుకు రెండు సార్లు తాగితే గ్యాస్ ట్రబుల్ సమస్య ఉండదు. అలాగే తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్దకం నుంచి కూడా బయట పడవచ్చు. సోంపు గింజలు జీర్ణ సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. కనుక ఈ చిట్కా చక్కని ఫలితాన్ని అందిస్తుంది. అలాగే ఎండిన చామంతి పువ్వులను నీటిలో మరిగించి టీ లా తయారు చేసుకుని రోజుకు 2 సార్లు తాగాలి. దీని వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ నుంచి బయట పడవచ్చు.
ఇక అల్లం ముక్కలను నీటిలో మరిగించి అల్లం టీని తాగుతున్నా కూడా గ్యాస్ సమస్య తగ్గుతుంది. అల్లం జీర్ణ సమస్యలను తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో అజీర్ణం, గ్యాస్ ఉండవు. కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుంది. ఇక అల్లం టీతోపాటు భోజనానికి ముందు అల్లం రసం కూడా సేవించవచ్చు. దీంతో ఆయా సమస్యలు తగ్గుతాయి. అలాగే భోజనం చేసిన అనంతరం చిటికెడు వామును బాగా మెదిపి అందులో కాస్త ఉప్పు వేసి తినాలి. వెంటనే గోరు వెచ్చని నీళ్లను తాగాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేయాలి. దీంతో కూడా గ్యాస్ సమస్య తగ్గుతుంది. అలాగే రోజుకు 2 సార్లు తులసి ఆకుల నీళ్లను సేవించాలి. దీంతోపాటు గ్యాస్ సమస్యను తగ్గించేందుకు జీలకర్ర నీళ్లు కూడా బాగానే పనిచేస్తాయి. ఇలా పలు చిట్కాలతో గ్యాస్ సమస్యతోపాటు ఇతర జీర్ణ సమస్యల నుంచి కూడా సులభంగా బయట పడవచ్చు.