Mutton Gongura : మనం మటన్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. మటన్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మటన్ గోంగూర కూడా ఒకటి. మటన్, గోంగూర కలిపి చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. తరుచూ చేసే మటన్ కర్రీ కంటే గోంగూర వేసి చేసే ఈ మటన్ గోంగూర కర్రీ మరింత రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఎవరైనా చాలా సులభంగా ఈ కర్రీని తయారు చేసుకోవచ్చు. రుచిగా, కమ్మగా ఉండే ఈ మటన్ గోంగూర కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ గోంగూర తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, గోంగూర – 3 చిన్న కట్టలు, లవంగాలు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, పచ్చిమిర్చి – 3, తరిగిన ఉల్లిపాయలు – 2, పసుపు – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, తరిగిన టమాట – 1, మటన్ – అరకిలో, కారం – 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – ఒక గ్లాస్, గరం మసాలా – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మటన్ గోంగూర తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక గోంగూర వేసి వేయించాలి. గోంగూర మెత్తగా మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని జార్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కుక్కర్ లో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి వేయించాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత మటన్ వేసి కలపాలి. తరువాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. తరువాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు వేయించాలి.
ఇలా వేయించిన తరువాత నీళ్లు, ఉప్పు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ఆవిరిపోయిన తరువాత మూత తీసి మరలా స్టవ్ ఆన్ చేసుకోవాలి. తరువాత ఇందులో మిక్సీ పట్టుకున్న గోంగూర, గరం మసాలా వేసి కలపాలి. తరువాత మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించిన తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మటన్ గోంగూర తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన మటన్ గోంగూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.