Mutton Paya : మ‌టన్ పాయ‌ను ఇలా ఎర్ర‌గా.. కారంగా చేసి తిన్నారంటే.. రుచి సూప‌ర్‌గా ఉంటుంది..

Mutton Paya : మాంసాహార ప్రియుల‌కు మ‌ట‌న్ పాయ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన పని లేదు. మ‌ట‌న్ పాయ చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. శ‌రీరానికి కావ‌ల్సిన వివిధ ర‌కాల పోష‌కాలు ల‌భిస్తాయి. ఈ మ‌ట‌న్ పాయ‌ను ఎవ‌రైనా సుల‌భంగా చేసేలా రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ట‌న్ పాయ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ముక్క‌లుగా త‌రిగిన మేక కాళ్లు – 4, ఉల్లిపాయ ముక్క‌లు – ఒక క‌ప్పు, నూనె – 4 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకులు – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ట‌మాట – 1, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – 3 టీ స్పూన్స్, ఎండు కొబ్బ‌రి పొడి – 2 టీ స్పూన్స్, నీళ్లు – ఒక లీట‌ర్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Mutton Paya best way to cook it
Mutton Paya

మ‌సాలా పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మిరియాలు – 12, యాల‌కులు – 4, ల‌వంగాలు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్.

మ‌ట‌న్ పాయ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో పాయ‌ను తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. దీనిని 5 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత నీటితో శుభ్రంగా క‌డ‌గాలి. ఇప్పుడు ఒక జార్ లో మ‌సాలా పొడికి కావ‌ల్సిన ప‌దార్థాల‌న్నీ వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని అదే జార్ లో ఉల్లిపాయ ముక్క‌లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక బిర్యానీ ఆకులు, మిక్సీ ప‌ట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ ను ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ప‌చ్చిమిర్చి వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా వేగిన త‌రువాత ప‌సుపు వేసి క‌ల‌పాలి. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసుకున్న పాయ‌ను వేసి క‌ల‌పాలి.

దీనిని 3 నిమిషాల పాటు బాగా వేయించిన త‌రువాత ఉప్పు, కారం, మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పొడి, ఎండు కొబ్బ‌రి పొడి వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి 3 నిమిషాల పాటు మ‌సాలాలు ముక్క‌ల‌కు ప‌ట్టేలా క‌ల‌పాలి. తరువాత ఇందులో నీళ్లు, కొత్తిమీర వేసి క‌ల‌పాలి. ఇప్పుడు కుక్క‌ర్ పై మూతను ఉంచి 6 నుండి 7 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత మూత తీసి అంతా క‌లిసేలా క‌లిపి ముక్క‌లు ఉడికిందో లేదా చూసుకోవాలి. ముక్క‌లు ఉడికితే కొత్తిమీర చ‌ల్లి స‌ర్వ్ చేసుకోవాలి లేదంటే మూత పెట్టి మ‌రో 3 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌ట‌న్ పాయ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ, పుల్కా, బ‌గారా అన్నం ఇలా దేనితో క‌లిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మ‌ట‌న్ పాయ‌ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు.

D

Recent Posts