పూర్వకాలం నుంచి మనలో అధిక శాతం మంది నాగమణులు నిజమే అని నమ్ముతూ వస్తున్నారు. మనకు బయట ఎప్పుడైనా పాములు ఆడించేవాళ్లు పాము తల నుంచి మణిని తీసి దాన్ని విక్రయిస్తుంటారు. అయితే నాగమణులు నిజంగానే ఉంటాయా ? అసలు వాటితో ఏం జరుగుతుంది ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నాగమణులు అన్ని రకాల పాముల్లో ఏర్పడవు. నాగుపాములు, తాచు పాములు వంటి వాటిల్లో ఏర్పడే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా దేన్నయినా కుట్టేందుకు పాము తన విషాన్ని ఉపయోగిస్తుంది. ఈ క్రమంలో ఒక్కోసారి విషాన్ని బయటకు తీసినా అది పూర్తి స్థాయిలో వినియోగం కాకపోతే దాని తలలోనే మిగిలిపోతుంది. ఇలా మిగిలిపోయిన విషం నల్లని రాయిలా మారుతుంది. అయితే ఇది అత్యంత అరుదుగా జరుగుతుంది. అందువల్ల పాముల తలల్లో నాగమణులు అంత సులభంగా ఏర్పడవు.
ఇక నాగమణులను పాము కుట్టిన చోట పెడితే విషం హరించుకుపోతుందని నమ్ముతుంటారు. కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయాన్ని ఇప్పటికే ధ్రువీకరించింది. పాము కుట్టిన చోట నాగమణిని ఉంచినా ప్రయోజనం ఉండదు. వెంటనే అత్యవసర చికిత్సను అందించాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోయేందుకు అవకాశాలు ఉంటాయి.
ఇక కొందరు నాగమణులను ఇళ్లలో పెట్టుకుంటే దుష్ట శక్తుల బాధ ఉండదని, అదృష్టాన్ని తెచ్చి పెడుతుందని, ఏదైనా నాగ దోషం ఉంటే పోతుందని చెబుతుంటారు. కానీ శాస్త్రాల పరంగా ఇలాంటి ఆధారాలు లేవు. కనుక నాగమణుల విషయంలో ప్రచారంలో ఉన్నదంతా వట్టిదేనని తేలిపోయింది.