Nalleru Pachadi : మన శరీరంలో ఉండే ఎముకలకు మేలు చేసే ఔషధ మొక్కలల్లో నల్లేరు మొక్క కూడా ఒకటి. దీనినే వజ్రవల్లి అని కూడా అంటారు. నల్లేరు మొక్కను చాలా మంది ఇండ్లల్లో కూడా పెంచుకుంటూ ఉంటారు. వయసు పైబడిన తరువాత వచ్చే ఎముకల సమస్యలను తగ్గించడంలో, విరిగిన ఎముకలు త్వరగా అతికేలా చేమయడంలో, ఎముకలను ధృడంగా, బలంగా ఉంచడంలో నల్లేరు మొక్క మనకు ఎంతగానో దోహదపడుతుంది. ఎముకలు పుష్టిగా ఉండాలనుకునే వారు నల్లేరు మొక్కను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ నల్లేరుతో చాలా మంది పప్పు, వేపుడు, పచ్చడి వంటి వాటిని తయారు చేస్తూ ఉంటారు. నల్లేరు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని తయారు చేయడం కూడా చాలా సులభం. రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ నల్లేరు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నల్లేరు పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నల్లేరు కాడలు – 2 కప్పులు, నూనె – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – 10, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి – 10 లేదా తగినన్ని, తరిగిన టమాటాలు – 4, చింతపండు – ఉసిరికాయంత, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు -4, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
నల్లేరు పచ్చడి తయారీ విధానం..
ముందుగా చేతులకు నూనె రాసుకుని నల్లేరుకు ఉండే పీచును తీసి వేయాలి. తరువాత వీటిని ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మెంతులు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మరికొద్దిగా నూనె వేసుకుని పచ్చిమిర్చి, నల్లేరు కాడలు వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై చక్కగా వేయించిన తరువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో టమాట ముక్కలు, చింతపండు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి టమాట ముక్కలను కూడా మెత్తగా అయ్యే వరకు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తరువాత రోట్లో లేదా జార్ లో ముందుగా వేయించిన నువ్వులు వేసి మెత్తగా చేసుకోవాలి.
తరువాత పచ్చిమిర్చి, నల్లేరు కాడలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, టమాట ముక్కలు వేసి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు తాళింపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చితో తాళింపు చేసి పచ్చడిలో వేసి కలపాలి. ఇందులోనే కొత్తిమీరను కూడా వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నల్లేరు పచ్చడి తయారవుతుంది. అన్నంతో పాటు దోశ, ఊతప్పం వంటి అల్పాహారాలతో కూడా ఈ పచ్చడిని తీసుకోవచ్చు. ఈవిధంగా నల్లేరుతో పచ్చడిని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.