Nimmakaya Karam Pachadi : నిమ్మకాయ కారం పచ్చడి.. నిమ్మరసంతో చేసకోదగిన చేసుకోదగిన వంటకాల్లో ఇది కూడా ఒకటి. ఈ పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా నిమ్మకాయ కారం పచ్చడిని తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. 15 నిమిషాల్లోనే దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ నిమ్మకాయ కారం పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మకాయ కారం పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నిమ్మకాయలు – 3, నూనె – 2 టీ స్పూన్స్, మెంతులు – పావు టీస్పూన్, మినపప్పు – 3 టీ స్పూన్స్, ఎండుమిర్చి – 15, ఇంగువ – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టీ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, కరివేపాకు – ఒక రెమ్మ, ఎండుమిర్చి – 2.
నిమ్మకాయ కారం పచ్చడి తయారీ విధానం..
ముందుగా నిమ్మకాయల నుండి రసాన్ని తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మెంతులు, మినపప్పు వేసి వేయించాలి. దీనిని చిన్న మంటపై దోరగా వేయించిన తరువాత ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించాలి. తరువాత స్టవ్ ఆప్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు జార్ లో ముందుగా ఎండుమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఉప్పు, పసుపు, వేయించిన మినపప్పు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. తరువాత నిమ్మరసం వేసి మరోసారి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాతతాళింపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత దీనిని కారంలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నిమ్మకాయ కారం తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన నిమ్మకాయ కారం పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.