Nimmakaya Karam : నిమ్మకాయ కారం.. గుంటూరు స్పెషల్ అయిన ఈ నిమ్మకాయ కారం పుల్ల పుల్లగా కారంగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా అల్పాహారాలతో తీసుకుంటూ ఉంటారు. చిటికెలో ఈ కారాన్ని తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి తయారు చేసుకుని నెలరోజుల పాటు దీనిని తినవచ్చు. ఇంట్లో నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కారాన్ని తయారు చేసి నిల్వ చేసుకోవచ్చు. అసలు వంటరాని వారు కూడా ఈ కారాన్ని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ నిమ్మకాయ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మకాయ కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
ఆవాలు – ఒక టేబుల్ స్పూన్, మెంతులు -ఒక టీ స్పూన్, నిమ్మరసం – 125 ఎమ్ ఎల్, కారం – 100 గ్రా., పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి – 4.
నిమ్మకాయ కారం తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఆవాలు, మెంతులు వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నిమ్మరసం తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న మెంతిపిండి వేసి కలపాలి. తరువాత పచ్చిమిర్చిని చీల్చి ముక్కలుగా చేసి వేసుకోవాలి. దీనిని అంతా కలిసేలా కలిపి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నిమ్మకాయ కారం తయారవుతుంది. దీనిని బయట ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. అదే ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల రెండు నుండి మూడు నెలల పాటు తాజాగా ఉంటుంది. దీనిని అన్నం, అల్పాహారాలతో తింటే చాలా రుచిగా ఉంటుంది.