Nuchinunde : నుచ్చినుండే.. ఈ పేరు మనలో చాలా మంది విని ఉండరు. ఇది ఒక వంటకం. కర్ణాటక స్పెషల్ వంటకాల్లో ఇది ఒకటి. దీనిని తినడం వల్ల మనం రుచికి రుచిని, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఒక చుక్క నూనెను వాడకుండా దీనిని మనం తయారు చేసుకోవచ్చు. నుచ్చినుండేను తయారు చేయడం కూడా చాలా తేలిక. మొదటిసారి చేసే వారు కూడా సులువుగా తయారు చేసుకోవచ్చు. దీనిని అల్పాహారంగా, స్నాక్స్ గా ఎలా అయినా తినవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ నుచ్చినుండేను ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నుచ్చినుండే తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసరపప్పు – పావు కప్పు, మినపప్పు – పావు కప్పు, శనగపప్పు – పావు కప్పు, కందిపప్పు – పావు కప్పు, బియ్యం – 2 టీ స్పూన్స్, ఎండుమిర్చి – 5, జీలకర్ర – ఒక టీ స్పూన్, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, , పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు, తరిగిన ఉల్లిపాయలు – అర కప్పు, కొత్తిమీర తరుగు – 3 టేబుల్ స్పూన్స్, తరిగిన కరివేపాకు – రెండు రెమ్మలు, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత.
నుచ్చినుండే తయారీ విధానం..
ఒక గిన్నెలో కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, బియ్యం, ఎండుమిర్చి వేసి తగినన్ని నీళ్లు పోయాలి. వీటిని రాత్రంతా లేదా కనీసం నాలుగు గంటల పాటు నానబెట్టాలి. తరువాత వీటిని మరోసారి కడిగి జార్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ దినుసులను బరకగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత వీటిని మనకు నచ్చిన ఆకారంలో కట్లెట్ లా వత్తుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నుచ్చినుండేలను ఆవిరి మీద 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత వాటిని టూత్ పిక్ తో గుచ్చి చూడాలి.
టూత్ పిక్ కు ఏమి అంటుకోకుండా వస్తే నుచ్చినుండే ఉడికినట్టుగా భావించి ప్లేట్ లోకి తీసుకోవాలి లేదంటే మరో 5 నిమిషాల పాటు ఉడికించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నుచ్చినుండే తయారవుతాయి. ఇంగువ వేసి వేడి చేసిన నెయ్యితో ఈ నుచ్చినుండేలను తింటే చాలా రుచిగా ఉంటాయి. అలాగే సులభంగా జీర్ణమవుతాయి. ఈ విధంగా నుచ్చినుండేలను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలను కూడా పొందవచ్చు.