Constipation : నేటి తరుణంలో జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది. గ్యాస్, మలబద్దకం, ఎసిడిటీ, అజీర్తి వంటి జీర్ణసంబంధిత సమస్యలతో మనలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోకపోవడం, ఒకే చోట ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం వంటి వివిధ కారణాల చేత ఈ సమస్యలు తలెత్తుతాయి. మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తే అవి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. కనుక మనం మన పొట్టను, ప్రేగులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
కొన్ని ఆయుర్వేద చిట్కాలను పాటించడం వల్ల మనం జీర్ణ సంబంధిత సమస్యలన్నింటిని దూరం చేసుకోవచ్చు. మన పొట్టను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవచ్చు. పొట్టను శుభ్రపరిచే ఆ చిట్కాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్దకం సమస్యను తగ్గించడంలో మనకు అంజీర్ మరియు ఎండు ద్రాక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక కప్పు నీటిలో ఒక అంజీర్ ను, 5 ఎండు ద్రాక్షలను వేసి 5 గంటల పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన నీటిని రోజూ ఉదయం మరియు రాత్రి రెండు పూటలా ఈ నీటిని తాగడం వల్ల మనం మలబద్దకం సమస్యను అధిగమించవచ్చు. అంజీర్ లో మరియు ఎండుద్రాక్షలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్దకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే మలబద్దకం సమస్య తలెత్తగానే మనం వంటల్లో నూనెకు బదులుగా దేశవాళీ ఆవు నెయ్యిని ఉపయోగించాలి.
ఆవు నెయ్యి లూబ్రికెంట్ గా పని చేసి ప్రేగుల్లో మలం నిల్వ ఉండకుండా మలం సాఫీగా జారీ అయ్యేలా చేయడంలో సహాయపడుతుంది. భోజనంలో నెయ్యి తీసుకోవడం ఇష్టంలేని వారు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ పాలల్లో ఒక టీ స్పూన్ నెయ్యిని కలిపి తీసుకోవాలి. అలాగే తీవ్రమైన మలబద్దకం సమస్యను తగ్గించడంలో మనకు ఆముదం నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆముదాన్ని కూడా వారానికి రెండు నుండి మూడు సార్లు మాత్రమే తీసుకోవాలి. మలబద్దకం సమస్య మరీ తీవ్రంగా ఉంటేనే ఆముదాన్ని ఉపయోగించాలి. రాత్రి పడుకునే ముందు ఒక కప్పు వేడి నీటిలో ఒక టీ స్పూన్ ఆముదాన్ని వేసి కలిపి తాగాలి. అయితే గర్భిణీ స్త్రీలు, వివిధ రకాల అనారోగ్య సమస్యలకు మందులు వాడే వారు ఆముదం నూనెను ఉపయోగించకపోవడమే మంచిది.
ఈ మూడు చిట్కాలను పాటించడం వల్ల మలబద్దకం సమస్య నుండి మనం పూర్తిగా బయటపడవచ్చు. అలాగే మలబద్దకం సమస్య మనకు మరలా రాకుండా ఉండాలంటే మన జీవన విధానంలో అలాగే ఆహారపు అలవాట్లల్లో కొన్ని మార్పులు చేసుకోవాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలను అధికంగా తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి. అలాగే వ్యాయామం చేయాలి. జంక్ ఫుడ్ ను, మసాలా కలిగిన ఆహారాలను ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే ఆహారాన్ని సమయానికి తీసుకోవాలి. ఆకుకూరలను, పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఈ చిట్కాలను వాడడం వల్ల మనం చాలా సులభంగా జీర్ణ సమస్యలన్నింటిని దూరం చేసుకోవచ్చు. మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఈ చిట్కాలను పాటించడం వల్ల ఎల్లప్పుడూ పొట్టను శుభ్రంగా ఉంచుకోవచ్చు. దీంతో మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండవచ్చు.