Oats Almonds Dates Breakfast : మన ఆరోగ్యానికి ఓట్స్ ఎంతో మేలు చేస్తాయి. వైద్యులు కూడా వీటిని ఆహారంగా తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. బరువు తగ్గడంలో, శరీరానికి కావల్సిన శక్తిని అందించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా ఓట్స్ మనకు దోహదపడతాయి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఓట్స్ తో చక్కటి రుచికరమైన స్మూతీని తయారు చేసుకుని అల్పాహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ స్మూతీని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మెదడు చురకుగా పని చేస్తుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. రక్తహీనత తగ్గుతుంది. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ ఓట్స్ స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్ బ్రేక్ ఫాస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
రోల్డ్ ఓట్స్ – 2 టేబుల్ స్పూన్స్, బాదంపప్పు – 2 టేబుల్ స్పూన్స్, ఖర్జూర పండ్లు – 3, ఆపిల్ – 1, పాలు- ఒక కప్పు, చియా విత్తనాలు – అర టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క పొడి – పావు టీ స్పూన్, తేనె- ఒక టేబుల్ స్పూన్.
ఓట్స్ బ్రేక్ ఫాస్ట్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఓట్స్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో బాదంపప్పును వేసుకోవాలి. అలాగే ఖర్బూర పండ్లల్లో ఉండే గింజలను తీసేసి వాటిని కూడా ముక్కలుగా చేసి వేసుకోవాలి. తరువాత ఇందులో అర కప్పు పాలు పోసి అర గంట పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఆపిల్ ముక్కలు, చియా విత్తనాలు, మరో అర కప్పు పాలు, తేనె, దాల్చిన చెక్క పొడి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత దీనిని గ్లాస్ లో పోసి పైన చియా విత్తనాలు, తరిగిన డ్రైఫ్రూట్స్ చల్లుకుని సర్వ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఓట్స్ బ్రేక్ ఫాస్ట్ తయారవుతుంది. షుగర్ ఉన్న వారు ఇందులో తేనెను వేసుకోకపోవడం మంచిది. దీనిని ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. నీరసం మన దరి చేరుకుండా ఉంటుంది. శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతంగా బరువు తగ్గవచ్చు. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరం బలంగా, ధృడంగా తయారవుతుంది.