Aloo Gravy Curry : మనం బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంపలతో వండే కూరలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది బంగాళాదుంపలను ఇష్టంగా తింటారు. బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఆలూ బఠాణీ మసాలా కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. తయారు చేయడానికి కూడా ఎక్కువగా సమయం పట్టదు. ఎక్కువ గ్రేవీ ఉండేలా రుచిగా, సులభంగా ఈ ఆలూ బఠాణీ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ బఠాణీ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన టమాట ముక్కలు – అర కప్పు, పచ్చిమిర్చి – 5, ఉడికించిన బంగాళాదుంపలు – 4 ( మధ్యస్థంగా ఉన్నవి), నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పచ్చి బఠాణీ – అర కప్పు, పసుపు – పావు టీ స్పూన్, కారం -ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి -ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కసూరి మెంతి – అర టీ స్పూన్.
ఆలూ బఠాణీ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలపై ఉండే పొట్టును తీసేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక జార్ లో టమాట ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత బఠాణీ వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి బఠాణీ మెత్తబడే వరకు వేయించాలి. బఠాణీలు మెత్తబడిన తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత ఒక గుప్పెడు కట్ చేసిన బంగాళాదుంప ముక్కలను తీసుకుని మెత్తగా నలిపి వేసుకోవాలి.
దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు ఉడికించి కట్ బంగాళాదుంప ముక్కలు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 6 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత కొత్తిమీర, కసూరి మెంతి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ బఠాణీ మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పూరీ ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసిన ఆలూ కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.