Electric Bike : రోజు రోజుకీ ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో వాహనదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఈ క్రమంలో రోజుకో కొత్త కంపెనీ ఇలాంటి వాహనాలను తయారు చేస్తూ వాహనదారులకు అందిస్తోంది. ఇక తాజాగా మరో కొత్త కంపెనీ ఈ మార్కెట్‌లోకి రంగ ప్రవేశం చేసింది. ఓబెన్ ఎలక్ట్రిక్ అనే ఓ స్టార్టప్ సంస్థ రోర్ (Rorr) అనే కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇందులో అనేక అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు.
ఈ రోర్ ఎలక్ట్రిక్ బైక్ పూర్తిగా స్పోర్ట్స్ లుక్‌ను కలిగి ఉంటుంది. దీన్ని భారత్ లోనూ తయారు చేశారు. సదరు ఓబెన్ ఎలక్ట్రిక్ బెంగళూరుకు చెందిన సంస్థ. ఈ క్రమంలోనే స్పోర్ట్స్ లుక్ ఉట్టిపడేలా ఈ బైక్‌ను రూపొందించారు. స్ప్లిట్ – స్టైల్ సీట్లు, పిలియన్ గ్రాబ్ రైల్, హై-సెట్ హ్యాండిల్‌బార్లు, వృత్తాకార హెడ్‌లైట్, యారోహెడ్ షేప్ మిర్రర్స్‌తో బైక్ డిజైన్ అద్భుతంగా ఉంది. ఇక ఇది పూర్తిగా బ్లాక్ అవుట్ మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్‌తో వస్తోంది. బైక్ ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపున మోనో-షాక్ యూనిట్స్ ను ఏర్పాటు చేశారు.
ఓబెన్ ఎలక్ట్రిక్ రోర్ బైక్‌ను యాప్ సహాయంతో ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ను ఇందులో ఏర్పాటు చేశారు. ఇందులో హావోక్, సిటీ, ఈకో మోడ్స్ లభిస్తాయి. దీంతో రహదారులకు అనుగుణంగా బైక్‌ను నడిపించవచ్చు. కాగా ఈ బైక్‌లో IP67-రేటెడ్ 4.4kWh బ్యాటరీ ప్యాక్ ను ఏర్పాటు చేశారు. అలాగే 10kW ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. ఈ క్రమంలో ఈ బైక్‌ను ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే ఏకంగా 200 కిలోమీటర్ల మేర మైలేజ్ వస్తుంది. ఈ బైక్‌పై గంటకు గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు. 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని ఈ బైక్ కేవలం 3 సెకన్లలోనే అందుకుంటుంది.
ఇక ఓబెన్ ఎలక్ట్రిక్ రోర్ బైక్ ధర రూ .99,999 గా ఉంది. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాలలో ఫేమ్ 2 పథకంలో భాగంగా దీనిపై సబ్సిడీని పొందవచ్చు. ఈ క్రమలంలోనే కేవలం రూ. 999 చెల్లించి ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. జూలై నెలలో డెలివరీ ఇస్తారు.