Onion Chapati : మనం ఉల్లిపాయలను వంటల్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. వంటల్లో ఉల్లిపాయలను ఉపయోగించడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఉల్లిపాయలను ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. కేవలం వంటల్లోనే కాకుండా ఉల్లిపాయలతో మనం రకరకాల చిరుతిళ్లను, ఇతర ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. ఈ ఉల్లిపాయలతో మనం ఎంతో రుచిగా ఉండే చపాతీని కూడా తయారుచేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసి చేసే ఈ చపాతీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఉల్లిపాయలతో రుచిగా చపాతీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆనియన్ చపాతీ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – 2 కప్పులు, చినక్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, ఉల్లిపాయ తరుగు – అరకప్పు, స్ప్రింగ్ ఆనియన్ తరుగు – అర కప్పు, ఉప్పు – తగినంత, గరం మసాలా – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్.

ఆనియన్ చపాతీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలన్నీ వేసి ఉల్లిపాయలను వత్తుతూ ముందుగా కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా నీటిని పోసుకుంటూ చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. పిండిని ఎంత ఎక్కువ సేపు కలుపుకుంటే చపాతీలు అంత మెత్తగా ఉంటాయి. ఇలా పిండిని కలుపుకున్న తరువాత దానిపై తడి వస్త్రాన్ని ఉంచి అరగంట పాటు పిండిని నాననివ్వాలి. తరువాత పిండిని ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుని పొడి గోధుమపిండి చల్లుకుంటూ చపాతీలా వత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం బాగా వేడెక్కిన తరువాత వత్తుకున్న చపాతీని వేసి ముందుగా రెండు వైపులా కొద్ది కొద్దిగా కాల్చుకోవాలి. తరువాత నూనె వేసుకంటూ రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆనియన్ చపాతీ తయారవుతుంది.
దీనిని కూరతో తినే పనే ఉండదు. నేరుగా అలాగే తినవచ్చు. ఈ చపాతీని పెరుగులో ఉప్పు వేసి దానితో కూడా కలిపి తినవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల చపాతీ రుచిగా ఉండడంతో పాటు ఎక్కువ సమయం వరకు మెత్తగా కూడా ఉంటుంది. దీనిని పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తరచూ చేసే చపాతీలతో పాటు అప్పుడప్పుడూ ఇలా ఉల్లిపాయలను వేసి చపాతీలను తయారు చేసుకుని తినవచ్చు.