Dates Syrup : మనం సాధారణంగా తీపి వంటకాల తయారీలో పంచదారను ఉపయోగిస్తూ ఉంటాం. అయితే పంచదార మన ఆరోగ్యానికి ఎంతో హానిని కలిగిస్తుంది. పంచదారను వాడడం వల్ల దుష్ప్రభావాలను ఎదుర్కొవాల్సి వస్తుందని తెలుసుకున్న చాలా మంది దానికి ప్రత్యమ్నాయంగా డేట్స్ సిరప్ ను వాడుతున్నారు. పాలల్లో, తీపి పదార్థాల తయారీలో పంచదారను వాడడానికి బదులుగా ప్రస్తుత కాలంలో ఈ డేట్ సిరప్ ను వాడుతున్నారు. ఖర్జూర పండ్లతో చేసే ఈ సిరప్ చాలా రుచిగా ఉంటుంది. ఖర్జూర పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కదా అని ఈ సిరప్ ను విరివిరిగా ఉపయోగిస్తున్నారు. ఖర్జూర పండ్లు మన ఆరోగ్యానికి మేలు చేసేవైనప్పటికి ఈ సిరప్ ను వాడడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఈ సిరప్ తయారీలో ఎక్కువగా కార్న్ సిరప్ ను ఎక్కువగా కలుపుతారు.అలాగే ప్రక్టోజ్ ఎక్కువగా ఉండే షుగర్ సిరప్ లను కూడా ఎక్కువగా కలుపుతూ ఉంటారు.
అలాగే దీనిలో ప్రిజర్వేటివ్స్, కలర్స్, వివిధ రకాల ప్లేవర్స్ ను కలుపుతూ ఉంటారు. ఇలా తయారు చేసిన డేట్స్ సిరప్ ను వాడడం వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ఎటువంటి కార్న్ సిరప్ లు కలపకుండా, ప్రిజర్వేటివ్స్ కలపకుండా సహజసిద్దంగా ఈ డేట్ సిరప్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న సిరప్ ను చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు ఎవరైనా ఉపయోగించవచ్చు. ఖర్జూర పండ్లతో సహజంగా సిరప్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా అరకిలో ఖర్జూర పండ్లను తీసుకుని వాటిలో గింజలు తీసేసి 40 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. తరువాత ఈ ఖర్జూర పండ్లను ఒక లీటర్ నీటిలో వేసి మెత్తగా ఉడికించాలి. ఇలా ఉడికించిన పండ్లను చేత్తో లేదా గంటెతో మెత్తగా చేసుకుని వడకట్టుకోవాలి.
ఇలా వడకట్టగా వచ్చిన సిరప్ ను మరలా గిన్నెలో పోసి కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే డేట్ సిరప్ తయారవుతుంది. ఈ సిరప్ ను గాజు సీసాలో తీసుకుని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేయాలి. పిల్లలకు జామ్ కు బదులుగా ఈ సిరప్ ను బ్రెడ్ మీద రాసి ఇవ్వవచ్చు. అలాగే ఫ్రూట్ జ్యూస్ లలో, వెజిటేబుల్ జ్యూస్ లలో ఈ సిరప్ ను కలిపి ఇవ్వవచ్చు. పండ్ల ముక్కల మీద కూడా రుచి కొరకు ఈ సిరప్ ను కలిపి ఇవ్వవచ్చు. పంచదార వాడకాన్ని తగ్గించి దానికి బదులుగా ఈ డేట్ సిరప్ ను వాడుకోవచ్చు. ఈ సిరప్ ను వాడడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు కలుగుతాయి. దుష్ప్రభావాలు అసలు ఉండనే ఉండవు. పంచదారకు బదులుగా ఈ సిరప్ ను వాడడం వల్ల కఫం, దగ్గు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. దంతాలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
అదేవిధంగా ఇలా తయారు చేసుకున్న 100 గ్రాముల డేట్స్ సిరప్ లో 312 కిలో క్యాలరీల శక్తి, 76 గ్రాముల పిండి పదార్థాలు, 6 గ్రాముల ఫైబర్, 1.3 గ్రాముల మాంసకృత్తులు, 72 మిల్లీ గ్రాముల క్యాల్షియం, 10 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. ఈ సిరప్ ను తీసుకోవడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. ఆస్థమా సమస్యతో బాధపడే వారు కూడా ఈ సిరప్ ను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈవిధంగా బయట కొనుగోలు చేసే డేట్ సిరప్ ను వాడి అనారోగ్యాన్ని కొన్ని తెచ్చుకోవడానికి బదులుగా ఇలా ఇంట్లోనే తయారు చేసుకున్న డేట్ సిరప్ ను వాడడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.