Onion Chutney For Tiffins : మనం ఉదయం పూట అల్పాహారాలను తినడానికి పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, టమాట చట్నీ ఇలా రకరకాల చట్నీలను తయారు చేస్తూ ఉంటాము. చట్నీతో తింటేనే ఏ అల్పాహారమైనా చాలా రుచిగా ఉంటుంది. అయితే తరచూ ఒకేరకం చట్నీలు కాకుండా మరింత రుచిగా మనం ఉల్లిపాయలతో కూడా చట్నీని తయారు చేసుకుని తినవచ్చు. ఇడ్లీ,దోశ ఇలా దేనితో తిన్నా కూడా ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా సులభం. అలాగే చాలా తక్కువ సమయంలో దీనిని తయారు చేయవచ్చు. తరచూ ఒకేరకం చట్నీలు కాకుండా ఇలా వెరైటీగా కూడా ట్రై చేయవచ్చు. అల్పాహారాలలోకి ఉల్లిపాయలతో చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 10, కరివేపాకు – గుప్పెడు, ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు – 3, ఉప్పు – తగినంత, చింతపండు – చిన్న నిమ్మకాయంత, పసుపు – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.

ఉల్లిపాయ చట్నీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు,ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే కళాయిలో ఉల్లిపాయ ముక్కలు, చింతపండు, పసుపు, ఉప్పు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు జార్ లో ముందుగా వేయించిన దినుసులు, ఎండుమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ చట్నీ తయారవుతుంది. దీనిని ఏ అల్పాహారంతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేరకం చట్నీలు కాకుండా ఇలా కూడా తయారు చేసి తీసుకోవచ్చు.