Hyderabadi Biryani Masala Powder : మనం బిర్యానీ తయారీలో వాడే పదార్థాల్లో బిర్యానీ మసాలా కూడా ఒకటి. బిర్యానీ మసాలా చాలా చక్కటి వాసనను కలిగి ఉంటుంది. ఈ మసాలాను వేస్తేనే బిర్యానీకి చాలా చక్కటి వాసన, రుచి వస్తుంది. అసలు ఈ మసాలాను వేయనిదే బిర్యానీ తయారు చేయరనే చెప్పవచ్చు. అయితే చాలా మంది ఈ మసాలాను బయట నుండి కొనుగోలు చేసి వాడుతూ ఉంటారు. అయితే బయట కొనుగోలు చేసే మసాలా వాసన ఎక్కువగా ఉండదు. ఇలా బయట కొనుగోలు చేయడానికి బదులుగా ఈ మసాలాను మనం ఇంట్లోనే తయారు చేసి వాడుకోవడం మంచిది. ఈ మసాలాను తాజాగా అప్పటికప్పుడు తయారు చేసి వాడడం వల్ల బిర్యానీ మరింత రుచిగా ఉంటుంది. ఇంట్లోనే హైదరాబాదీ బిర్యానీ మసాలాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాదీ బిర్యానీ మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
నల్ల యాలకులు – 2, మరాఠీ మొగ్గలు – 2, దాల్చిన చెక్క – 2 ( రెండు ఇంచులవి), జాజికాయ – అర ముక్క, అనాస పువ్వులు – 3, యాలకులు – 10, లవంగాలు – 15, జాపత్రి – 2, మిరియాలు – ఒక టీ స్పూన్, ధనియాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, సాజీరా -ఒక టీ స్పూన్, సోంపు – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకులు – 2( పెద్దవి).
హైదరాబాదీ బిర్యానీ మసాలా తయారీ విధానం..
ముందుగా కళాయిలో నల్ల యాలకులు, మరాఠీ మొగ్గలు, దాల్చిన చెక్క, జాజికాయ, అనాస పువ్వులు, యాలకులు, లవంగాలు, జాపత్రి వేసి వేయించాలి. వీటిని దోరగా వేయించిన తరువాత ధనియాలు, జీలకర్ర, సాజీరా, సోంపు, బిర్యానీ ఆకులను ముక్కలుగా చేసి వేసుకోవాలి. వీటన్నింటిని మాడిపోకుండా కలుపుతూ వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ దినుసులన్నీ చల్లారిన తరువాత జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల హైదరాబాదీ బిర్యానీ మసాలా తయారవుతుంది. దీనిని గాలి తగలకుండా మూత ఉండే గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. దీనిని బిర్యానీతో పాటు ఇతర నాన్ వెజ్ వంటకాల్లో కూడా వాడుకోవచ్చు. ఈ మసాలాను వేయడం వల్ల కూరలు మరింత రుచిగా ఉండడంతో పాటు చక్కటి వాసన కూడా వస్తాయి.