Onion Paratha : గోధుమపిండితో చేసుకోదగిన వంటకాల్లో పరాటాలు కూడా ఒకటి. పరాటాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే రకరకాల పరాటాలను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన పరాటాల్లో ఉల్లిపాయ పరాటా కూడా ఒకటి. ఈ పరాటా చాలా రుచిగా ఉంటుంది. అలాగే అల్పాహారంగా తీసుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఉల్లిపాయలతో కమ్మటి పరాటాలను సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ పరాటా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమ పిండి – ఒకటిన్నర కప్పు, ఉప్పు – తగినంత, నెయ్యి – 2 టీ స్పూన్స్, నీళ్లు – తగినన్ని, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2 ( మధ్యస్థంగా ఉన్నవి), పచ్చిమిర్చి – 2, అల్లం – ఒక ఇంచు ముక్క, వాము – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, గరం మసాలా -అర టీ స్పూన్, చిన్నగా తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, పుట్నాల పప్పు పొడి – 2 టేబుల్ స్పూన్స్.
ఉల్లిపాయ పరాటా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఉప్పు, నెయ్యి వేసి బాగా కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా చూసుకోవాలి. తరువాత పిండిపై కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసి మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను తీసుకోవాలి. తరువాత అల్లం, పచ్చిమిర్చిని కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. తరువాత ఇందులో మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత గోధుమపిండిని మరోసారి కలిపి కొద్దిగా పిండిని తీసుకోవాలి. దీనిని పొడి పిండి చల్లుకుంటూ పూరీలా చిన్నగా వత్తుకున్న తరువాత అందులో ఉల్లిపాయ మిశ్రమాన్ని ఉంచాలి. తరువాత అంచులను మూసేసి మరలా పొడి పిండి చల్లుకుంటూ పరోటాలా వత్తుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక పరాటాను వేసి కాల్చుకోవాలి. దీనిని ముందుగా రెండు వైపులా దోరగా కాల్చుకున్న తరువాత నెయ్యి లేదా నూనె వేస్తూ రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ పరాటా తయారవుతుంది. వీటిని పెరుగుతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇలా ఉల్లిపాయలతో చేసిన పరాటాలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ లోకి కూడా ఈ పరాటాలు చాలా చక్కగా ఉంటాయి.