Tomato Bathani Curry : పచ్చి బఠాణీలను కూడా మనం వంటల్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాము. బఠాణీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాలు ఉంటాయి. వీటిని కూడా మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వంటల్లో వాడడంతో పాటు ఈ బఠాణీలతో మనం కూరలను కూడా తయారు చేస్తూ ఉంటాము. వాటిలో టమాట బఠాణీ కూర కూడా ఒకటి. బఠాణీలతో చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎంతో రుచిగా, సులువుగా అయ్యే ఈ టమాట బఠాణీ కర్రీని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట బఠాణీ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
టమాటాలు – 8, పచ్చి బఠాణీ – ఒక కప్పు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, మెంతులు – చిటికెడు, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 10, తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు- తగినంత, కారం – 2 టీ స్పూన్స్, బెల్లం తురుము – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
టమాట బఠాణీ కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత కరివేపాకు వేసి వేయించాలి. తరువాత బఠాణీ వేసి కలిపి మూత పెట్టి 3 నిమిషాల పాటు వేయించాలి. తరువాత టమాట ముక్కలు, పసుపు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి 4 నుండి 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మూత తీసి ఉప్పు, కారం వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీటిని కూడా పోసుకోవచ్చు. తరువాత మరలా మూత పెట్టి టమాట ముక్కలు పూర్తిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
ఇలా ఉడికించిన తరువాత బెల్లం తురుము, ధనియాల పొడి, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట బఠాణీ కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పూరీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.