Onion Rice : మనం వంటల్లో విరివిరిగా ఉపయోగించే వాటిల్లో ఉల్లిపాయ కూడా ఒకటి. ఉల్లిపాయ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఉల్లిపాయలను వంటల్లో వాడడంతో పాటు మనం వీటితో పచ్చడి, పులుసు వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటాం. కేవలం పచ్చడి, పులుసే కాకుండా ఉల్లిపాయలతో మనం ఎంతో రుచిగా ఉంటే రైస్ ను కూడా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయలతో చేసే రైస్ చాలా రుచిగా ఉంటుంది. కేవలం పది నిమిషాల్లోనే దీనిని మనం తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఆనియన్ రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆనియన్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, యాలకులు – 3, లవంగాలు – 3, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, అనాస పువ్వు – 1, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 3, సన్నగా పొడుగ్గా తరిగిన పెద్ద ఉల్లిపాయలు – 2, చిన్న ముక్కలుగా తరిగిన పచ్చిమిర్చి – 2, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నీళ్లు – పావు కప్పు, అన్నం – ఒక గ్లాస్ బియ్యంతో వండినంత.
ఆనియన్ రైస్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిన తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కలపాలి. తరువాత కరివేపాకు వేసి కలిపి వేయించాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. ఈ మసాలాలను నీరంతా ఇంకిపోయేంత వరకు వేయించిన తరువాత కొత్తిమీర వేసి కలపాలి. తరువాత అన్నం వేసి అంతా కలిసేలా చక్కగా కలపాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై కలుపుతూ వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఆనియన్ రైస్ తయారవుతుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేయడానికి సమయం లేనప్పుడు ఇలా ఆనియన్ రైస్ ను తయారు చేసుకుని తినవచ్చు. లంచ్ బాక్స్ లోకి కూడా ఈ రైస్ చాలా చక్కగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.