Pachi Kobbari Pachadi : మనం అప్పుడప్పుడూ పచ్చి కొబ్బరిని తింటూ ఉంటాం. పంచదార లేదా బెల్లంతో పచ్చి కొబ్బరిని కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే పచ్చి కొబ్బరితో తీపి పదార్థాలతోపాటు పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటాం. పచ్చి కొబ్బరితో చేసే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు కూడా ఈ పచ్చడిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరితో పచ్చడిని రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి కొబ్బరి ముక్కలు – ఒక కప్పు, నూనె – ఒక టేబుల్ స్పూన్, శనగ పప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండు మిరపకాయలు – 8 లేదా తగినన్ని, కరివేపాకు – రెండు రెబ్బలు, పసుపు – పావు టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 4, చింతపండు – కొద్దిగా, ఉప్పు – తగినంత, నీళ్లు – 50 ఎంఎల్.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండు మిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ, ఇంగువ – చిటికెడు.
కొబ్బరి పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి నూనెను వేడి చేయాలి. నూనె వేడయ్యాక శనగ పప్పు, మినప పప్పు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తరువాత కొబ్బరి ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత పసుపును కూడా వేసి మరో నిమిషం పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటన్నింటినీ ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి.
తరువాత నీటిని వేసి మరోసారి మిక్సి పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మరో కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన తరువాత దీనిని ముందుగా సిద్దం చేసుకున్న పచ్చడిలో వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతోపాటు ఉదయం అల్పాహారంలో చేసే దోశ వంటి వాటితో కూడా కలిపి తీసుకోవచ్చు. ఈ విధంగా పచ్చి కొబ్బరితో పచ్చడిని చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.